యువతి అపహరణకు యత్నం | - | Sakshi
Sakshi News home page

యువతి అపహరణకు యత్నం

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

దొడ్డబళ్లాపురం: రాజస్థాన్‌లో ప్రేమ వివాహం చేసుకుని బెంగళూరులో భర్తతో కలిసి జీవిస్తున్న యువతిని ఆమె కుటుంబీకులు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని యువతిని కాపాడిన సంఘటన బుధవారం రాత్రి బెంగళూరులోని మాగడి రోడ్డులో జరిగింది. దుండగులు అడ్డదిడ్డంగా కారు నడిపి ఆరుమందిని గాయపరిచారు.

ఎలా జరిగిందంటే..

వివరాలు.. రాజస్థాన్‌లోని మేల్వాస్‌ గ్రామం నివాసులైన గుణరామ్‌ కుమార్తె పూజ (21), శేషారామ్‌ కుమారుడు ఓంప్రకాశ్‌ ఇద్దరూ ప్రేమించుకుని 9 నెలల క్రితం వివాహం చేసుకుని బెంగళూరులోని దాసరహళ్లి అగ్రహారలో వచ్చి నివసిస్తున్నారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని గుణరామ్‌ రౌడీలను పంపాడు. వారు బుధవారం రాత్రి కారులో వచ్చారు. పూజను కిడ్నాప్‌ చేసి తీసికెళ్తుండగా అరుపులు విన్న స్థానికులు దుండగుల కారును వెంబడించారు. ఈ క్రమంలో దుండగుల కారు 20పైగా వాహనాలను ఢీకొంది. రాజస్థాన్‌కు చెందిన రాకేశ్‌ (21), శరణ్‌ (25), అయాస్‌ (18) లను పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ సద్దాం పరారయ్యాడు. దుండగుల కారు ఢీకొని పృథ్విరాజ్‌ (12), యశిక (9), అమూల్య (35), మణి (64), జయలక్ష్మి (57), సంతోష్‌ (33) అనే స్థానికులు గాయపడ్డారు. జయలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

హుబ్లీలో 2 ఏటీఎంలో

రూ.14 లక్షల లూటీ

హుబ్లీ: హుబ్లీలో గజదొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలను పగలగొట్టి రూ.14 లక్షలు దోపిడీ చేశారు. హుబ్లీ సిటీ పక్కనే ఉండే సుల్లా, బ్యారట్టిలోని ఏటీఎంలలో గురువారం తెల్లవారుజామున ఈ దోపిడీలు జరిగాయి. మొదట దొంగలు ఏటీఎం సెంటర్ల షట్టర్ల తాళాలను పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. కాపలాదారులు ఎవరూ లేకపోవడంతో పని సులువైంది. ఏటీఎంను యంత్రాలతో బద్ధలు కొట్టి నగదును తీసుకెళ్లారు. తమ బాగోతం రికార్డు కాకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. సుల్లాలో ఏటీఎం గ్రామం నడిబొడ్డున ఉన్నా యథేచ్ఛగా దోపిడీ జరగడం గమనార్హం. ఏటీఎంలను పరిశీలించిన ఆయా బ్యాంకుల అధికారులు మొత్తం రూ.14 లక్షలు పోయినట్లు తెలిపారు. రాజస్థాన్‌, హరియానా ముఠాల పనేనా, లేక స్థానిక దొంగలా? అనేది తేలాల్సి ఉంది. డీఎస్పీ, సీఐలు పరిశీలించి ఆధారాలను సేకరించారు.

నగరంలో రాజస్థాన్‌ రౌడీల రచ్చ

కారుతో ఢీకొనడంతో ఆరుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement