హుబ్లీ: భూమి దస్తావేజులను సవరించేందుకు రూ.50 లక్షల భారీ లంచం తీసుకుంటున్న ధార్వాడ తహసీల్దార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ధార్వాడ కేసీడీ కళాశాల వద్ద జరిగింది. తహసీల్దార్ సచ్చిదానంద కుసనూరు చిక్కాడు.
వివరాలు.. సమీపంలో యరికొప్ప గ్రామం సరిహద్దులో బాగల్‌కోట జిల్లా ముదోళ తాలూకావాసి మంజునాథ అరివికట్టే అనే రియల్టర్ 33 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 13 ఎకరాల భూమికి సంబంధించి కొన్ని అనుమతులు, సవరణకు తహసీల్దారుకు దరఖాస్తు చేశాడు. పని జరగాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పైగా ఒకేసారి డబ్బులు తీసుకుని రావాలని, రెండు ఎకరాల పొలం కూడా తనకు రాసివ్వాలని బేరం పెట్టాడు.
లోకాయుక్తకు సమాచారం..
తహసీల్దారు గొంతెమ్మ కోర్కెలతో కంగుతిన్న రియల్టర్ లోకాయుక్త అధికారులకు మొరపెట్టుకున్నాడు. బుధవారం సాయంత్రం కర్ణాటక కళాశాల మైదానం వద్ద రూ.50 లక్షలను తహసీల్దారు సచ్చిదానందకు అందజేస్తుండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి లంచం డబ్బుతో సహా అతనిని అరెస్ట్ చేశారు. తహసీల్దార్‌ను కోర్టులో హాజరుపరచగా,14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించారు. వేలాది విద్యార్థులు జ్ఞానార్జన చేసే కాలేజీ వద్ద లంచం తీసుకోవడం చర్చనీయాంశమైంది. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప, డీఎస్పీ రవీంద్ర, సీఐలు ప్రసాద్, కరుణేష్ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. తహసీల్దారు రూ.50 లక్షలు లంచం తీసుకుంటున్నాడంటే, గతంలో ఇంకెంత మొత్తం సంపాదించాడోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాలూకాఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో ప్రజల పనులు జరగాలంటే వేలకు వేల లంచాలు కోరుతున్నారని ఆరోపణలున్నాయి.
రూ.50 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ధార్వాడ తహసీల్దారు
13 ఎకరాల పనికి రియల్టర్ దరఖాస్తు
డబ్బుతో పాటు 2 ఎకరాలు కోరిన వైనం
రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు
రూ.8లక్షలతో జీఎస్టీ అధికారి..
దొడ్డబళ్లాపురం: వ్యాపారి నుంచి రూ.8లక్షలు లంచం తీసుకుంటూ జీఎస్టీ అధికారి లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన బెంగళూరులో జరిగింది. జీఎస్టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్ దొరికిపోయాడు. ఇనుప వ్యాపారం చేస్తున్న జమీర్ అనే వ్యాపారి జీఎస్టీ చెల్లింపుల్లో లోపాలను సరి చేసేందుకు ఈ అధికారి రూ.20 లక్షల ముడుపులు డిమాండు చేశాడు. చివరకు రూ.8 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అధికారి ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యాపారి జమీర్ లోకాయుక్త పోలీసులను ఆశ్రయించగా వివరాలు తెలుసుకున్నారు. వ్యాపారి నుంచి మోహిత్ ప్రతాప్ సింగ్ రూ.8 లక్షలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


