మండ్య: కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. మండ్య జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకాలోని బి.బి. కావలు గ్రామంలో ఈక్విటాస్ మైక్రో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ఇంటి అప్పు కంతు కట్టలేదంటూ చంటిబిడ్డతో ఉన్న బాలింతను, కుటుంబాన్ని గెంటేసి ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన 5 రోజుల క్రితం జరగగా, దళిత సంఘాలు ఈ అమానుష చర్యను వెలుగులోకి తెచ్చాయి. దేవరాజు, యశోద, వారి కుమారుడు సంతోష్, భార్య ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ కుటుంబం ఇంటిని కుదువపెట్టి రూ.4 లక్షల రుణం తీసుకుంది. మొదట్లోనే వడ్డీ ఖర్చుల కింద రూ.లక్ష కట్ చేసి 3 లక్షలు మాత్రమే ఇచ్చారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. ఇప్పుడు అప్పు చెల్లించడం లేదంటూ ఇంటికి తాళం వేసి దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. 5 రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా ఆరుబయటే అలమటిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అప్పు కట్టలేదని ఇంటికి తాళం
మండ్య జిల్లాలో మైక్రో ఫైనాన్స్ దురాగతం


