సాక్షి,బళ్లారి: సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన నరేంద్రమోదీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మహానుభావుడని, గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగుతున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో పాటు రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి వారి యోగ క్షేమాలను గురించి తెలుసుకున్నారు. మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, జిల్లా ఆస్పత్రి ఇన్‌ఛార్జి బసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని ఫొటో లేదని
ఎంపీ మండిపాటు
సాక్షి,బళ్లారి: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో, పేరును బ్యానర్ ముద్రించకపోవడంతో లోక్‌సభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గదగ్ ఏపీఎంసీలోని స్వామి వివేకానంద సభాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోటో పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే దేశ ప్రధానమంత్రి, అందులోనూ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని ఫోటో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కులవృత్తితో పాటు విద్య అనివార్యం
బళ్లారిటౌన్: విశ్వకర్మ సమాజం వారికి కులవృత్తితో పాటు విద్య కూడా అవసరమని లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ తదితర శాఖల ఆధ్వర్యంలో జోళదరాఽశి దొడ్డనగౌడ రంగమందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విశ్వకర్మ సమాజం వారు చాలా కాలంగా, తమ కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని, వారి జీవితం అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ సమాజం వారు పిల్లలకు మంచి విద్యాబోధన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. పాలికె మేయర్ గాదెప్ప మాట్లాడుతూ దైవ రూపాన్ని సృష్టించడంలో విశ్వకర్మ సమాజం వారు నైపుణ్యత కలిగి ఉన్నారని కొనియాడారు. న్యాయవాది త్రివేణి పత్తార్, కన్నడ సంస్కృతి శాఖ జేడీ నాగరాజు, విశ్వకర్మ వికాస వేదిక అధ్యక్షుడు చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బొజ్జగణపయ్యకు పూజలు
బళ్లారి రూరల్ : నగరంలోని సింధిగి కాంపౌండ్‌లో గణేశ మిత్ర మండలి ఆధ్వర్యంలో 49వ ఏడాది వినాయక చవితిని వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజులో భాగంగా గురువారం బొజ్జ గణపయ్యకు శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు. శుక్రవారం నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఫంక్తిని ఏర్పాటు చేసి సుమారు వెయ్యి మందికి అన్నసంతర్పణ చేశారు. మిత్ర మండలి ప్రముఖులు గురురాజ్, డాక్టర్ నాగరాజరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాలు సంస్కృతికి ప్రతీక
రాయచూరు రూరల్: గణేష్ ఉత్సవాలు హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని కిల్లేమఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. గురువారం నగరంలో కిల్లేమఠం వద్ద కేసరి గజానన యువక మండలి గణపతి ప్రతిష్టాపనకు పూజలు చేసి భక్తులనుద్దేశించి మాట్లాడారు. నగరసభ మాజీ సభ్యులు దరూరు బసవరాజ్, ప్రశాంతి, సత్యనారాయణ, సతీష్, ధారాసింగ్, పురుషోత్తం ఇనాని, గురుస్వామి, ఈరణ్ణ, నాగరాజ్, సంతోష్‌లున్నారు.


