రాయచూరు రూరల్: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని చితక బాదడంతో మృత్యువాత పడిన ఘటన బుధవారం రాత్రి జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో జరిగింది. మద్యం తాగిన మైకంలో తాలూకాలోని భూపుర తాండాకు చెందిన శివనగౌడ నాయక్ రాంపూర్(26)ను చితకబాదడంతో తలలో రక్తం గడ్డ కట్టింది. రాత్రి వేళ దొంగ సారాయి తాగి గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మండపం వద్దకు వెళ్లాడు. అక్కడ స్వల్ప ఘర్షణ జరిగింది. అతడిని చికిత్స నిమిత్తం లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శివనగౌడ నాయక్‌కు ముగ్గురు సంతానం ఉండగా, ప్రస్తుతం భార్య ఆరు నెలల గర్భిణి అని, శివనగౌడ నాయక్‌పై దాడికి పాల్పడిన వారిని వెంకటేశ్, అనిల్, లక్కప్ప, శంక్రప్పలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లింగసూగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కార్నాడ్ తెలిపారు. వెంకటేష్‌ను అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
వీడిన మిస్టరీ
● మృతుడు మొళకాల్మూరు వాసి
కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిని కర్ణాటక వాసిగా పోలీసులు గుర్తించారు. గురువారం మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించారు. మొళకాల్మూరు తాలూకా కొండ్లహళ్లి గ్రామానికి చెందిన రుద్రప్ప, నాగలక్ష్మి దంపతులకు కుమారుడు మైలారి(25), కుమార్తె ఉన్నారు. వీరు ఈనెల 9న ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చారు. మైలారికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఉదిరిపికొండ వైపు వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా కనిపించక పోవడంతో వారు ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లిపోయారు. పోలీసులు అతని భుజాలపై ఉన్న పచ్చబొట్టు అక్షరాల ఆధారంగా బళ్లారి పోలీసులకు సమాచారమివ్వగా వారి ద్వారా మృతుడి ఆచూకీ లభించడంతో మిస్టరీ వీడింది.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
రాయచూరు రూరల్: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం తాలూకాలోని బన్నిగనూరులోని తన ఇంట్లో రైతు విరుపణ్ణ(66) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సింధనూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దిద్దిగి వ్యవసాయ సేవా సహకార సంఘం బ్యాంక్‌లో రూ.4 లక్షలకు తోడు అదనంగా రూ.10 లక్షలను అప్పు చేశాడు. ఈ ఏడాది వర్షాలు లేక కాలువలకు సకాలంలో నీరందక పోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో విషం తాగినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. విరుపణ్ణకు ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారన్నారు. బళగానూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిష్పక్షపాత దర్యాప్తు కోసం ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మారెప్ప, రవీంద్రనాథ్ మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. నరసింహులు, శివ కుమార్, బేరి, హేమరాజ్‌లున్నారు.


