రాయచూరు రూరల్ : జిల్లాలో అభివృద్ధి చెందని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం మహాత్మగాంధీ క్రీడాంగణంలో 78వ కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్ నంజుండప్ప నివేదిక ఆధారంగా సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టికల్–371(జే) వల్ల ఒనగూరే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అక్షర ఆవిష్కారలో ఉపాధ్యాయుల నియామకాలు జరుపుతామన్నారు. నిరుద్యోగులకు వృత్తి విద్యా కోర్సులతో ఎక్కువగా ఉద్యోగాలున్నాయన్నారు. ప్రభుత్వ కొలువులో అందరికీ అవకాశం ఉందన్నారు. మాజీ మంత్రి ఎన్ ఎస్ బోసురాజు, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏసీ హంపన్న, నగరసభ అధికారి జుబీన్ మహాపాత్రోలున్నారు. యాదగిరిలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, బీదర్‌లో అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కాలువలో నీటి గేజ్ కాపాడండి
తుంగభద్ర ఎడమ కాలువలో నీటి గేజ్ నిర్వహించాలని అధికారులకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్ సింగ్ ఆదేశించారు. గురువారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎడమ కాలువ 47వ మైలు వద్ద నీటి నిర్వహణకు అధికారులు సహకరించి ఆయకట్టు చివరి భూములకు నీరందించడానికి గేజ్ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఈ విషయంలో ఇంజనీర్లు సక్రమంగా కాలువలో నీటి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించడానికి అధికారులు ముందుకు రావాలన్నారు. కరువు సహాయక పనుల విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందడం లేదన్నారు. జొన్నలు విక్రయించిన రైతులకు ఐదు నెలల నుంచి బకాయిలు చెల్లించకుండా ఉన్న అంశంపై చర్చిస్తామన్నారు. కరువు ప్రాంతంలో తాగునీటి కోసం జిల్లాధికారి వద్ద రూ.11 కోట్ల నిధులు ఉన్నాయని, అందులో రూ.6 కోట్లు వ్యయం చేయడానికి అవకాశం కల్పించామన్నారు. కరువు పరిహారం విషయంపై చర్చించడానికి శుక్రవారం మంగళూరులో ప్రత్యేక మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.
మంత్రి అజయ్‌సింగ్


