బస్సులు ఆపాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

బస్సులు ఆపాలని రాస్తారోకో

Jul 9 2026 6:47 AM | Updated on Jul 9 2026 6:47 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు వద్ద కర్ణాటక రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. మంగళవారం కలబుర్గి–రాయచూరు రహదారికి అడ్డంగా నిలబడి హైస్కూలు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా సంచాలకురాలు రూపా మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికి సక్రమంగా ఆర్టీసీ బస్సులు రావడం లేదన్నారు. ఉదయం పూట బస్‌ డ్రైవర్లు బస్టాప్‌ల వద్ద బస్సులను నిలపకుండా నాన్‌ స్టాప్‌ బస్‌లు అంటూ ప్రతి వాహనానికి బోర్డులు పెట్టుకుని నేరుగా వెళుతుండటాన్ని ఖండించారు. బస్సులు దొరకక ఉదయం వేళలో విద్యార్థులు పాఠశాల తరగతులకు గైర్హాజరవుతున్నట్లు తెలిపారు. తమకు బస్టాపుల్లో బస్సులను నిలపాలని మూడు గంటల పాటు విద్యార్థులు రాస్తారోకో చేశారు. సక్రమంగా బస్సులను నడపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

మహిళ మృతి కేసులో

నిందితుడికి జైలు శిక్ష

హుబ్లీ: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని మహిళ మృతికి కారకుడైన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, అలాగే రూ.5 వేల జరిమానా విధిస్తూ హుబ్లీ సీనియర్‌ సెషన్స్‌, జేఎంఎఫ్‌సీ ఫస్ట్‌ గ్రేడ్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. రాజేష్‌ మునిరత్నం శిక్ష పడిన వ్యక్తి. 2022లో ఇక్కడి కేశ్వాపుర సర్వోదయ సర్కిల్‌లో కారును వేగంగా నడుపుతూ వచ్చిన రాజేష్‌ ద్విచక్ర వాహనంపై వెళుతున్న పాయల్‌ జైన్‌ అనే మహిళను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పాయల్‌ జైన్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. ఘటనపై తూర్పు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజేష్‌పై కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి యమునప్ప కరె హనుమంతప్ప సైమేరకు తీర్పు ఇచ్చినట్లు ఈ కేసు వాదించిన ప్రభుత్వ న్యాయవాది సిద్దలింగప్ప నాగరఠాణ ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లా కోర్టును సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

హొసపేటె: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభా బఖ్రు జిల్లా కోర్టును సందర్శించి, న్యాయశాఖ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన జిల్లా అడ్వొకేట్‌ హౌస్‌ను సందర్శించి కొంతసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మొక్కను నాటారు. ప్రధాన జిల్లా సెషన్స్‌ జడ్జి కేఎం.రాజశేఖర్‌, అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి బీటీ.కుమారస్వామి, జిల్లా న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.సుబ్రహ్మణ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రశాంత్‌ నాగలాపుర, 2వ అదనపు సివిల్‌ జడ్జి శృతి తేలి, 3వ అదనపు సివిల్‌ జడ్జి శారదీ రాజ్‌, అదనపు జిల్లా కమిషనర్‌ ఈ.బాలకృష్ణ, ఏఎస్పీ మంజునాథ్‌, సబ్‌–డివిజనల్‌ ఆఫీసర్‌ పి.వివేకానంద, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గుజ్జల నాగరాజ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మురుగు.. రోడ్డుపై పరుగు

రాయచూరు రూరల్‌: పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు తోడు డ్రైనేజీల్లో పూడిక పేరుకు పోయి మురుగు నీరు రోడ్డుపై పరుగులు తీసిన ఘటన జిల్లాలోని కవితాళ పట్టణంలో చోటు చేసుకుంది. పురసభ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పటికై నా డ్రైనేజీల్లో పేరుకున్న పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించి మురుగు నీరు సజావుగా పారేలా చేసి ఇబ్బందులను తప్పించాలని, గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement