బనశంకరి: సిలికాన్ సిటీలో మరో భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అపరిచిత సుందరి తీయని మాటల మాయలో పడిన టెక్కీ రూ.1.66 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఫ్రాడ్ బెంగళూరులో జరగ్గా, బాధితుడు ఆగ్నేయ విభాగం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ప్రేమ, పెళ్లి.. పెట్టుబడులు
వివరాలు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌరవ్ దూబే నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 15న టంటన్ అనే ప్రముఖ డేటింగ్ యాప్‌లో అతనికి రియా అగర్వాల్ అనే పేరు గల యువతి పరిచయమైంది. చాటింగ్ చేసుకుంటూ స్నేహితులుగా మారారు. తరువాత రియా అతని మొబైల్ నంబరు తీసుకుని తరచూ ఆడియో, వీడియోకాల్స్ చేస్తూ దగ్గరైంది. దూబెని వివాహం చేసుకుంటానని నమ్మించింది. బాధితుడు పూర్తిగా వలలో పడిపోయాడని గ్రహించిన మోసగత్తె... ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు లాభం పొందవచ్చునని, మన భవిష్యత్తుకు ఎంతో సహాయంగా ఉంటుందని ఆశపెట్టింది. యువతి మోజులో పడిన టెక్కీ ఏమాత్రం ఆలోచించకుండా మూడు నెలల అవధిలో తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.1.66 కోట్లను ఆమె చెప్పిన ఖాతాలకు పంపించాడు.
మొబైల్ స్విచ్చాఫ్
కోట్లాది రూపాయలు సమర్పించుకున్న సౌరబ్ దూబె ఖాతాలోకి లాభాల పేరిట రూ.4,250 వచ్చాయి. దీంతో అనుమానపడిన అతడు తన పెట్టుబడి డబ్బు, లాభం వెనక్కి ఇవ్వాలని రియా అగర్వాల్‌ను అడిగాడు. కొన్నిరోజుల పాటు మాటలు చెప్పి తప్పించుకుంది. అతడు ఒత్తిడి తీవ్రం చేయడంతో వంచకురాలు మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసుకుని అదృశ్యమైంది. దీంతో టెక్కీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. చివరకు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకురాలు, ఆమె బ్యాంకు అకౌంట్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. డేటింగ్ యాప్స్‌లో అపరిచితుల ప్రలోభాలకు గురికావద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరించారు.
డేటింగ్ యాప్‌లో టెక్కీకి యువతి టోకరా
పెట్టుబడుల పేరుతో నగదు బదిలీ


