భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

సాక్షి,బళ్లారి: త్యాగం, విశ్వాసం, సేవాభావం, బలిదానాలకు ప్రతీకగా భావించే బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకుని నగరంలోని ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బక్రీద్‌ పండుగను ఆచరించుకున్నారు. బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈద్గా, మసీదుల వద్ద ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి చిన్నారులు, పెద్దలు, వృద్ధులు ఆనందోత్సాహాలతో పండుగ సంబరాల్లో మునిగి తేలారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో మార్కెట్లు కిటకిటలాడాయి. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు నాసిర్‌ హుస్సేన్‌, పలువురు ప్రముఖులు ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సోదరులను కలుసుకుని వారితో పాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, త్యాగ, బలిదానాలకు ప్రతీక

అనంతరం వక్తలు మాట్లాడుతూ త్యాగ, బలిదానాలు, ప్రేమ, సోదరభావానికి బక్రీద్‌ పండుగ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సామూహిక ప్రార్థనలు చేయడం ద్వారా సోదరభావం పెరుగుతుందని, ఒకరినొకరు కలుసుకునేందుకు, కష్టసుఖాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. బక్రీద్‌ పండుగ కేవలం ఒక మతపరమైన పండుగే కాదని, ఇది మానవత్వాన్ని గుర్తు చేసే మహోత్సవం అన్నారు. ప్రేమ, కరుణ, దానం, త్యాగం వంటి విలువలను సమాజానికి తెలియజేస్తుందన్నారు. ప్రస్తుతం సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఇలాంటి పండుగలు దోహదం చేస్తాయని, గొప్ప సందేశం ఇస్తాయన్నారు. ప్రేమను పంచుకోవడం, పేదలకు సహాయం చేయడం, సమాజంలో శాంతి నెలకొల్పడం ఇవే బక్రీద్‌ పండుగ అసలు సారాంశం అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

రాయచూరు రూరల్‌: నగరంలో బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకున్నారు. గురువారం ఈద్గా మైదానం, ఏక్‌ మినార్‌ మసీదులో ముస్లింలతో మసీదు నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్నారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

బళ్లారిలోని ఈద్గా వద్ద బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న నాయకులు

రాయచూరులో సామూహిక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు

ప్రత్యేక సామూహిక ప్రార్థనలు

ఈద్గాలు, మసీదులు కిటకిట

Advertisement
 
Advertisement
Advertisement