పరమేశ్వర్‌ను సీఎం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరమేశ్వర్‌ను సీఎం చేయాలి

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా హోం మంత్రి, దళిత నేత డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌ను నియమించాలని చలువాది మహాసభ డిమాండ్‌ చేసింది. గురువారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు విశ్వనాథ్‌ పట్టి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకుడు రాహుల్‌ గాంధీ ముఖ్యమంత్రిని మార్పు చేస్తే ఆ పదవిని దళితులకు కేటాయించాలన్నారు. పరమేశ్వర్‌కు గతంలో కేపీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. 2023 ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు కావాలని అభ్యర్థించి ఇప్పుడు ప్రధాన పదవులు మాత్రం అగ్ర నాయకులకు కేటాయించడం తగదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాల్లో ముఖ్యమంత్రి పదవిని పరమేశ్వర్‌కు కేటాయించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.

గుండెపోటుపై

అవగాహన అవసరం

రాయచూరు రూరల్‌: గుండె సంబంధిత వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముమ్మర ప్రచారం చేస్తామని సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రి వైద్యుడు, అంతర్జాతీయ రేడియాలజిస్ట్‌ సంకే కులకర్ణి వెల్లడించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుండెపోటుకు గురైన సమయంలో నూతనంగా బిపాస్ట్‌ పథకాన్ని రూపొందించారన్నారు. రేడియాలజీలో స్క్యాన్‌, ఆల్ట్రా సౌండ్‌, యాంజియోగ్రామ్‌, ఇమేజింగ్‌ వల్ల ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పత్రికి రావడానికి సమయం పడుతుందన్నారు. ఆ సమయంలో బిపాస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాయచూరులో ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రజలకు శాపంగా

కాంగ్రెస్‌ ప్రభుత్వం

హొసపేటె: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని, ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. గురువారం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిపాలన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకం ఎవరికీ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కలహాల కారణంగా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందన్నారు. గత మూడేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిందన్నారు. ఒక వైపు రాష్ట్రం ఆర్థిక దివాలా దిశగా పయనిస్తుండగా మరో వైపు రాష్ట్ర ప్రజలు అవినీతి అరాచకాలతో విసిగిపోయారన్నారు.

హంపీలో తాగునీటికి కటకట

ఇబ్బందుల్లో పర్యాటకులు

హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ హంపీలో తాగునీటి సమస్య నెలకొంది. హంపీలోని రాణి స్నానగృహం(క్వీన్స్‌బాత్‌) సమీపంలో ఏర్పాటు చేసిన శుభ్రమైన తాగునీటి యూనిట్‌ కొన్ని రోజులుగా మూసివేతకు గురైంది. దీంతో క్వీన్స్‌బాత్‌ను సందర్శించే పర్యాటకులకు తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. పర్యాటకులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంపీకి వచ్చే పర్యాటకులు, స్థానిక సిబ్బంది, తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. శిథిలావస్థలో ఉన్న తాగునీటి యూనిట్‌కు త్వరగా మరమ్మతులు చేసి శాశ్వత తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని పర్యాటకులు డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ లాడ్జిలో వ్యక్తి మృతి

హోసూరు: డెంకణీకోట తాలూకా పరిధిలోని కూతనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (53) రాయకోటలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి శ్రీనివాస్‌ ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈక్రమంలో రాయకోటలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో శ్రీనివాస్‌ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీనివాస్‌ కుమారుడు మాదేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement