కోలారు: ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ధ శ్రీ వినాయక దేవాలయంలో సోమవారం జేష్ట అధికమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, పూజల తరువాత సుమారు 14 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని వెన్నతో అలంకరించారు. ప్రధాన అర్చకులు లోకనాథ్ దీక్షిత్ నేతృత్వంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విఘ్ననాథున్ని దర్శించుకుని పునీతులయ్యారు.
దర్శన్ కేసు కోర్టు మార్పు
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసును విచారణ బెంగళూరు సీసీహెచ్ కోర్టు నుంచి 59వ సెషన్స్ కోర్టుకు మార్చారు. కనీసం 60మంది ప్రముఖ సాక్షులను ఒక సంవత్సరం లోపు విచారించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని నిందితుడు, నటుడు దర్శన్ తరఫు లాయర్ బెంగళూరు సెషన్స్ కోర్టుకు అందించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలి. ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. వచ్చే ఏడాది మే లోపు కేసు విచారణ పూర్తి చేయకపోతే దర్శన్ బెయిలు కోసం రావచ్చని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసింది. కోర్టు మారడంతో విచారణ జడ్జి కూడా మారుతారు.
ఘనంగా
కరగాదమ్మ ఉత్సవాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకాలోని గెరటిగనబెలెలో 80 సంవత్సరాల తర్వాత గ్రామదేవతల ఉత్సవం జరుగుతోంది. ఆదివారం ప్రారంభమైన వేడుకలలో ఉత్తమ కరగాదమ్మ దేవి, బాలిగై కరగాదమ్మ దేవిల కరగ ఉత్సవం జరగనుంది. మహిళలు జ్యోతులను ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చి సమర్పించారు. సోమవారం రాత్రి నుంచి దీపోత్సవం, కరగ వేడుక వైభవంగా సాగాయి.
రాజ్యసభ సీటుపై
సదానంద కన్ను
మైసూరు: రాజ్యసభ సీట్ల కోసం బీజేపీలో పోటీ నెలకొంది. నేను కూడా రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నాను అని మాజీ సీఎం డి.వి.సదానంద గౌడ చెప్పారు. సోమవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము, జేడీఎస్ ఒకే కూటమిలో ఉన్నాము. మాకు 63, జేడీఎస్‌కి 17 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. నన్ను రాజ్యసభకు పంపడం జాతీయ నాయకులు చూసుకుంటారు. రాజ్యసభ సీటు కోరుతున్నాను’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని మార్చే ప్రతిపాదన మాకు లేదు, మరో ఏడాదిలో మూడేళ్ల పదవీకాలం ముగుస్తుందని, అప్పుడు ఆలోచిస్తారని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరితో ప్రజలు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ యాభై సీట్ల కన్నా తక్కువకే పడిపోతుంది అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్రం చూసుకుంటోందని అన్నారు.
వేడుకగా భగీరథ మహర్షి జయంతి
తుమకూరు: ఉప్పార సముదాయం ఆధ్వర్యంలో తాలూకాలోని హుళికుంటె హోబళి కరేతిమ్మనహళ్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను, గంగ పూజను నిర్వహించారు. మహిళలు పూల జ్యోతుల మధ్య మహర్షి చిత్రపటాన్ని ఉంచి ఊరేగింపు జరిపించారు. ఈ సందర్భంగా సముదాయ నేతలు మాట్లాడుతూ ఉప్పారలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్టీ హోదాను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కఠోర శ్రమనే ’భగీరథ ప్రయత్నం’ అంటారు. అటువంటి గొప్ప మహర్షికి వారసులుగా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు.


