యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా శిరాలి తట్టెహక్కలు వెంకటాపుర నదిలో ఆదివారం ఆల్చిప్పల కోసం వెళ్లి కొట్టుకుపోయి మరణించినవారి సంఖ్య 11కు పెరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక మరో రెండు మృతదేహాలను, సోమవారం ఉదయం మరొకరి శవాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. సోమవారం ఉదయం మొత్తం 11 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో బంధువులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాల మీద పడి విలపించారు. సారదహొళె గ్రామ శివారులో జేసీబీతో పెద్ద గుంత తీసి సామూహికంగా ఖననం చేశారు. జిల్లా మంత్రి మంకాళు వైద్య నివాళులు అర్పించి కుటుంబాలకు సాంత్వన పలికారు. నదిలో ఆల్చిప్పలను వెతకడం సాధారణమని, ఇప్పుడే ఎందుకు జరిగిందో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాపాడాలని వెళ్లి...
నదిలో మొదట మాస్తమ్మ నాయక కొట్టుకుపోతుండగా ఆమెను రక్షించడానికి కొడుకు ఉమేశ్ నాయక ప్రయత్నించాడు. కానీ అతడూ ప్రమాదంలో పడిపోయాడు. ఇలా ఒకరిని రక్షించాలని మరొకరు నీటిలో గల్లంతైనట్లు బతికి బయట పడిన మహిళ తెలిపారు.
అనాఽథలైన పిల్లలు
9 కుటుంబాలకు చెందిన పిల్లలు తల్లి, లేదా తండ్రిని పోగొట్టుకున్నారు. మాదేవ నాయక, లక్ష్మీ ఇద్దరూ చనిపోగా వారి సంతానం దర్శన్, కీర్తన అనాథలయ్యారు. మరో మహిళ లక్ష్మీ శివరాం భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడు, ఆమె ఇప్పుడు నదిలో మరణించింది. నలుగురు పిల్లలు రోడ్డునపడ్డారు. ఈ విషాదాలు గ్రామస్తులను కలిచివేశాయి.
ఎప్పుడూ జరగని రీతిలో
ఏటా ఏప్రిల్, మే నెలల్లో నదిలో ఆల్చిప్పలను వెతకడం ఇక్కడ పేదలకు వృత్తి. ఆల్చిప్పలు నీటిలో కొట్టుకు వస్తుంటాయి. వాటిని పట్టుకొని అమ్ముకుని కొంత సంపాదిస్తారు. 3 రోజులుగా వానలు కురిసి నది నిండి ప్రవహిస్తున్న సమయంలో లోతు తెలియక చాలా మంది దిగారు. చివరకు తీవ్ర విషాదం సంభవించింది.
మొత్తం 11 మంది మృత్యువాత
శోకసంద్రమైన గ్రామం


