బనశంకరి: హైకమాండ్ పిలుపుతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ సోమవారమే వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరారు. సీఎం హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. శివకుమార్ కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల విమానంలో వెళ్లారు. హైకమాండ్ సిద్దరామయ్య ను మాత్రమే ఆహ్వానించగా, డీసీఎం కూడా వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సీఎం వెంట ఆప్త మంత్రులు జీ.పరమేశ్వర్, ఎంబీ.పాటిల్, హెచ్‌సీ.మహదేవప్ప, బైరతి సురేశ్, కేజే.జార్జ్ ఉన్నారు. మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీలోనే ఉన్నారు.
మంత్రులతో సిద్దు బల ప్రదర్శన
ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సిద్దరామయ్య.. ఒకవేళ సీఎం మార్పును కోరితే, సీనియర్ మంత్రుల ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేలా ఉన్నారు. పరోక్షంగా బల ప్రదర్శనతో ఢిల్లీకి వెళ్లారు. హోంమంత్రి పరమేశ్వర్ హోమం జరిపి బయల్దేరారు. నేడు ఉదయం 11 గంటలకు సిద్దరామయ్య హైకమాండ్ నేతలను కలుస్తారు.
తమ్ముడు తోడుగా డీకే
దేవనహళ్లి రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకున్న శివకుమార్ తుమకూరులోని నోనవినకెరెకు వెళ్లి తన ఆరాధ్య దైవమైన అజ్జయ్యస్వామి పాదుకల దర్శనం చేసుకున్నారు. ఆదివారం కూడా పాదుకలను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి 7:40 గంటలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కారు. అన్న సూచనతో తమ్ముడు డీకే సురేశ్ ముందే హస్తినకు వెళ్లారు.


