విమానాశ్రయ నిర్మాణానికి గ్రహణం | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయ నిర్మాణానికి గ్రహణం

May 26 2026 7:42 AM | Updated on May 26 2026 7:42 AM

సాక్షి,బళ్లారి: జిల్లాలో పరిశ్రమల పేరుతో భూములను రైతుల వద్ద నుంచి నయానో, భయానో తీసుకున్న తర్వాత ఆయా పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిరివార, చాగనూరు మధ్య రైతుల వద్ద విమానాశ్రయం నిర్మాణం కోసం తీసుకున్న భూమిలో విమానాశ్రయం నిర్మించకపోగా, మరో ప్రాంతానికి మార్పు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న విమానాశ్రయ నిర్మాణంపై ఈ ప్రాంత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 2008లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గాలి జనార్దనరెడ్డి, మంత్రులు శ్రీరాములు తదితరులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిరివార, చాగనూరు వద్ద భూసేకరణ చేపట్టారు. దాదాపు 1000 ఎకరాలను వందలాది మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, త్వరలో పూర్తి చేస్తామని పాలకులు, అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు.

స్థల మార్పిడిపై జోరుగా ప్రచారం

ఈ విషయంపై అసెంబ్లీలో ఎన్నోసార్లు చర్చ కూడా జరిగింది. అయితే సిరివార, చాగనూరు మధ్య విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టకుండా, స్థల మార్పిడి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై సంబంధిత మంత్రి కూడా స్పందించి ఒక అడుగు ముందుకు వేశారు. బళ్లారి జిల్లా కుడితిని, దరోజీ సమీపంలో నూతన విమానాశ్రయ నిర్మాణం చేపడితే బళ్లారితో పాటు విజయనగర, కొప్పళ జిల్లా వాసులకు కూడా మేలు చేకూరుతుందని తెలపడం విశేషం. కుడితిని, దరోజీ సమీపంలో నూతన విమానాశ్రయానికి దాదాపు 2 వేల ఎకరాల భూమి అవసరం అవుతుండటంతో ఆ దిశగా పనులు చేపట్టేందకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణానికి పదేళ్ల క్రితం భూమిపూజ చేసి పనులు ప్రారంభించి వదిలేశారు. ఇక్కడ ఏవిధంగా ప్రభుత్వం స్పందిస్తుందోనన్న విషయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కుడితిని, దరోజీ సమీపంలో విమానాశ్రయ నిర్మాణం జరిపితే ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీకి వచ్చే పర్యాటకులకు మేలు జరుగుతుందన్న వాదన ఉంది.

అక్కడ నిర్మిస్తే హంపీ, అంజనాద్రిలకు మేలు

శ్రీఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రికి కూడా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేస్తూ జనంలో చర్చ జరిగేలా చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే బళ్లారి జిల్లాలో పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమలు నిర్మించలేదని, రైతులు వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని పరిశ్రమలు నిర్మించక, రైతుల వద్ద పొలాలు లేకుండా, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జిల్లాలో రైతు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నయానో, భయానో ప్రభుత్వానికి తక్కువ ధరకే భూములను అప్పగించేశారు. బళ్లారి నుంచి హొసపేటె మార్గ మధ్యలో వేలాది ఎకరాలను వివిధ పరిశ్రమల కోసం రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

కొనసాగుతున్న రైతుల పోరాటాలు

ఒక పరిశ్రమ పేరు చెప్పి మరో పరిశ్రమకు అప్పగిస్తుండటంతో రైతులు పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి అయితే చేసేది మరోలా ఉంటోందని, దీంతో రైతులు నష్టపోతున్నారని, రైతు కుటుంబాలు వీధిన పడుతున్నాయని రైతు సంఘఽం నాయకులు ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న తర్వాత ఆ పరిశ్రమలు స్థాపించి, రైతు కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి రైతులను పక్కన పెట్టేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరివార, చాగనూరు వద్ద రైతుల నుంచి తీసుకున్న భూములను కూడా విమానాశ్రయం కోసం తీసుకుని, ప్రస్తుతం స్థల మార్పు చేస్తామని ప్రకటించడంతో, మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను ఏ విధంగా ఉపయోగించుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. రైతులు వద్ద భూములను తీసుకున్నారు, విమానాశ్రయం నిర్మించలేదు, ప్రభుత్వం వద్ద భూమిని ఉంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిరివార, చాగనూరు మధ్య

విమానాశ్రయం లేనట్లేనా?

తాజాగా కుడితిని, దరోజీ సమీపంలో ఏర్పాటుకు సన్నాహాలు

బళ్లారి, విజయనగర, కొప్పళ, జిల్లా వాసులకు అనుకూలం కోసం మార్పు

రైతుల నుంచి తీసుకున్న భూములు దేనికి ఉపయోగిస్తారో మరి?

పరిశ్రమల పేరుతో భూములు

లాక్కోవడం పరిపాటిగా మారిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement