జొన్న కొనుగోళ్ల బకాయిలు చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోళ్ల బకాయిలు చెల్లించండి

May 26 2026 7:42 AM | Updated on May 26 2026 7:42 AM

రాయచూరు రూరల్‌: గత ఏడాది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో జొన్నలు కొనుగోలు చేసిన వారు రైతులకు ఉన్న బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి డిమాండ్‌ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 లక్షల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసిన సర్కార్‌ రైతులకు రూ.303 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కేవలం 80 వేల క్వింటాళ్లకు రూ.32 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఆరు నెలలు గడిచినా నేటికీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయక పోవడాన్ని తప్పుబట్టారు. సెప్టెంబర్‌లో కొనుగోలు చేసిన వాటికి నేటికీ డబ్బులు ఇవ్వక పోవడంపై ఆందోళన చేపడతామన్నారు.

ఇంట్లోకి చొరబడి

చోరీకి యత్నం

నిందితుడిని

పట్టుకున్న పోలీసులు

హొసపేటె: నగరంలోని అనంతశయనగుడి సమీపంలోని శివశక్తి నగర్‌లో ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను ఇంటి యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాత్రి శివశక్తి నగర్‌లో మత్తుగా తిరుగుతున్న ఒక వ్యక్తి ఓ ఇంటి గేటు దూకి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. సీసీ టీవీలో గమనించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. హిందీ మాట్లాడే సదరు వ్యక్తి ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ గేటు దూకి లోపలికి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇంటి యజమాని సకాలంలో స్పందించడం వల్ల జరగబోయే దొంగతనాన్ని నివారించగలిగారు.

ఉపాధ్యాయ పోస్టులు

భర్తీ చేయాలని ధర్నా

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూలులో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగాకాంక్షుల పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు శరణ బసప్ప ఉద్బాళ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 15 వేల నుంచి 20 వేల మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన ఉపాధ్యాయ పోస్టులను భభర్తీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో కాలం గడపడం మానుకోవాలన్నారు. విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప నూతన ఉపాధ్యాయ నియామకాలకు పచ్చజెండా ఊపాలన్నారు. ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రిల్‌, చిత్రలేఖనం, సంగీత ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. విద్యా శాఖలో 79,694 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 22,595 మంది ఉపాధ్యాయులను నియమించుకోవాలన్నారు. జిల్లాలో 1,175 అతిథి, 1,066 ఉపాధ్యాయ పోస్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో చెన్నబసవ, వినోద్‌ కుమార్‌, వెంకటేష్‌, బసవరాజ్‌, కాశీనాథ్‌లున్నారు.

పర్యాటకుని ఔదార్యం

మొబైల్‌ను తిరిగిచ్చిన వైనం

హొసపేటె: హంపీలో ఒక పర్యాటకుడు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను ఓ వ్యక్తి తిరిగి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఘటన జరిగింది. దక్షిణ కాశీ హంపీలోని ప్రపంచ ప్రసిద్ధ విరుపాక్ష ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన ముంబైకి చెందిన ఒక పర్యాటకుడు తన పర్యటన సమయంలో మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న ఆ మొబైల్‌ ఫోన్‌ బాషా సాహెబ్‌ అనే పర్యాటకునికి దొరికింది. అతను ఆ మొబైల్‌ ఫోన్‌ను హంపీ పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత తన మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్న ముంబైకి చెందిన ఒక పర్యాటకుడిని కనుగొని అతనికి తిరిగి ఇచ్చారు. తన మొబైల్‌ ఫోన్‌ను తిరిగి పొందిన ముంబైకి చెందిన పర్యాటకుడు దానిని తిరిగి ఇచ్చిన తోటి పర్యాటకుడిని అభినందించాడు. పర్యాటకునికి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను తిరిగి ఇచ్చినందుకు పర్యాటక మిత్రుడు బాషా సాహెబ్‌ భారీగా ప్రశంసలు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement