రాయచూరు రూరల్: అక్క కెఫెతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జెడ్పీ యోజనాధికారి శరణ బసవ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని జిల్లా భవనంలో ఏర్పాటు చేసిన అక్క కెఫె మహిళా సంఘం పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక సహకారంతో పాటు ఉత్తమ రీతిలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. కెఫె ద్వారా స్వసహాయ మహిళా ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. రాయచూరు, లింగసూగూరుల్లో తల్లీబిడ్డల ఆస్పత్రిలో అక్క కెఫెతో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. అక్క కెఫెలో వంటలు హోటల్ కంటే ఇంటి భోజనం మాదిరిగా ఉంటాయన్నారు. సమావేశంలో టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, నాగరాజ్, శ్రీదేవిలున్నారు.
ఆక్రమణల తొలగింపు
రాయచూరు రూరల్: నగరంలో అక్రమ కట్టడాలను నగరసభ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించారు. సోమవారం చంద్ర మహాబళేశ్వర సర్కిల్ నుంచి రోడ్డుకు కుడి, ఎడమ వైపున ఉన్న దుకాణాలను, కాలువపై స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న వాటిని తొలగించాలని నెల రోజుల క్రితం అక్రమ కట్టడాల యజమానులకు గడువు కల్పిస్తూ నోటీసులిచ్చారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు కార్యాచరణ చేపట్టారు. మురుగు కాలువపై స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు, హోటళ్లు నిర్మించుకున్నారని, అలాంటి వారందరూ స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో వాటిని జేసీబీతో తొలగించారు.
బాలికపై అత్యాచారం
హుబ్లీ: ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడ లేఔట్‌లో చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఖాజాసాబ్ పఠాన్‌పై విద్యాగిరి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఖాజాసాబ్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా స్థానికులు ఖాజాసాబ్‌ను పట్టుకొని నిలదీశారు. అతడి మొబైల్‌ను పరిశీలించగా బాలికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది.
పాతకక్షతో..
కంప్యూటర్ క్లాస్‌కు వెళుతున్న బాలికను మాటలతో మభ్య పెట్టి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం 18 ఏళ్ల బాలికపై అల్లాబక్షి కొప్పద అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
బిగ్ బాస్ నటి కావ్యకు అవమానం
● కలబుర్గిలో వేదికపై హైడ్రామా
● అభిమానుల జోరుతో గందరగోళం
రాయచూరు రూరల్: కలబుర్గిలో బిగ్ బాస్ సీరియల్ నటి కావ్యకు అవమానం జరిగింది. గత రాత్రి కలబుర్గిలోని పండిత రంగ మందిరంలో ఏర్పాటు చేసిన 12వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిగ్ బాస్ సీరియల్ కావ్యను అభిమానులు హేళన పరిచేలా నడుచుకోవడంతో ఆమె కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యక్రమంలో అభిమానుల జోరు అధికం కావడంతో ప్రాయోజకులు అభిమానులపై చెయ్యి చేసుకోగా గందరగోళం నెలకొంది. దీంతో ఆమె అర్థాంతరంగా వెనుదిరిగారు.
హక్కు పత్రాలివ్వాలని వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా సింగేరిదొడ్డి వాసులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం దేవదుర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు మల్లనగౌడ మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాల, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కరెమ్మకు వినతిపత్రం సమర్పించారు.


