బళ్లారిటౌన్: జిల్లాలో ఎక్కువ అవుతున్న బాల్య వివాహాలు, మైనర్ల గర్భధారణ కేసుల నియంత్రణకు అధికారులు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీష్ సుమేర సూచించారు. సోమవారం నూతన జిల్లాధికారి కార్యాలయ భవన సభాంగణంలో జిల్లా స్థాయి సమన్వయ పరిశీలన సమితి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇలాంటి కేసులను సంపూర్ణంగా నియంత్రించి విద్యా, పౌష్టికాహారం, సామాజిక న్యాయం కల్పించాలన్నారు. డిసెంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు జిల్లాలో రెండు పోక్సో కేసులు, 92 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో 80 కేసుల్లో పిల్లలను తల్లిదండ్రులను ఒప్పించి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. 15 కేసులు మిగిలి ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ శాఖాధికారిణి నందిని శిండే వివరించారు. సండూరు, సిడిగినమొళ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ జరపాలని అన్నారు. సండూరులో కేవలం 32 కేజీల బరువు ఉన్న 16 ఏళ్ల గర్భిణి మృతి చెందడం విచారకరమన్నారు. ఇలాంటి విషయాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు కేవలం చట్ట ప్రకారం చర్యలే కాకుండా గ్రామ స్థాయిలో కూడా జాగృతి కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవ ప్రాధికారం కార్యదర్శి న్యాయమూర్తి రాజేష్ హొసమని, ఏఎస్పీ నవీన్‌కుమార్, డీఎస్పీ గోవిందరాజులు, అధికారులు రామకృష్ణ నాయక్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన


