జూన్‌ 20 నాటికి గొలుసుల ఏర్పాటు పూర్తి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 20 నాటికి గొలుసుల ఏర్పాటు పూర్తి

May 26 2026 7:42 AM | Updated on May 26 2026 7:42 AM

హొసపేటె: తుంగభద్ర జలాశయం భద్రత, ఆధునీకరణలో కీలకమైన క్రస్ట్‌గేట్లకు గొలుసులు అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్‌ 20 నాటికి అన్ని గేట్ల పనులు పూర్తవుతాయి. జలాశయానికి చెందిన మొత్తం 33 గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పాత, తుప్పు పట్టిన గేట్ల సాంకేతిక వ్యవస్థను పూర్తిగా మార్చి పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే రెండు గేట్లకు కొత్త గొలుసులు అమర్చారు. మే నెలాఖరు నాటికి మొత్తం 15 గేట్లకు గొలుసుల ఏర్పాటు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప తెలిపారు. సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంలో గేట్లకు చేపడుతున్న గొలుసుల ఏర్పాటు పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం 17 గేట్లకు గొలుసులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన గేట్ల గొలుసులు జూన్‌ మొదటి వారంలో అందుతాయి.

ప్రతి గేటు బరువు 50 టన్నులు

జలాశయం ప్రతి గేటు బరువు సుమారు 50 టన్నులు కాగా, దాని కోసం అమర్చిన ఒక్కొక్కటి 1.8 టన్నుల నుంచి 1.9 టన్నుల బరువు ఉన్న రెండు గొలుసులతో కలిపి మొత్తం బరువు సుమారు 55 టన్నులు ఉంటుంది. ఇంతటి పటిష్టమైన వ్యవస్థను చాలా సురక్షితంగా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు డ్యాం భద్రతకు ఢోకా లేదన్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం డ్యాంపై సమగ్ర భద్రతా సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడైతే నీరు లీక్‌ అయిందో అక్కడ ఇప్పటికే గ్రౌటింగ్‌, ఇంజెక్టింగ్‌ ద్వారా మరమ్మతులు చేశారన్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు జలాశయానికి ఎలాంటి సమస్య ఉండదని టీబీ బోర్డు అధికారులు సాంకేతిక హామీ ఇచ్చారు. ఈ భద్రతా నివేదికపై త్వరలో ఉపముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్‌తో చర్చించి సమీక్షించనున్నారు.

ప్రత్యామ్నాయ నవలి కోసం సన్నాహాలు

ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 30 టీఎంసీల పూడికతో నిండినందున ప్రత్యామ్నాయంగా నవలిని నిర్మించాల్సిన అవసరం పెరిగింది. సీడబ్ల్యూసీ అనుమతితో సహా కొత్త డ్యాం నిర్మాణానికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో కొప్పళ, రాయచూరు జిల్లాల రైతుల సాగునీటి ప్రయోజనాల దృష్ట్యా నవలి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో త్వరలో ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. టీబీ డ్యాం ఈఓ ఎన్‌.చంద్రశేఖర్‌, ఏఈఈ కే.జ్ఞానేశ్వర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement