నేత్రపర్వంగా కరగ | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా కరగ

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

మాలూరు: తాలూకాలోని మాస్తి ఫిర్కా కుప్పూరు గ్రామంలో ఆదివారం శ్రీ ధర్మరాయస్వామి, శ్రీ ద్రౌపతాంబ దేవి కరగ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుప్పూరులో పురాతన ద్రౌపతాంబ దేవి దేవాలయంలో ఏటా కరగ వేడుక జరుగుతుంది. ఇదే మాదిరిగా శనివారం రాత్రి ఆవాలయం ముందున్న కళ్యాణి ప్రాంగణంలో కరగ పూజారిని ముస్తాబు చేశారు. మేళాతాళాల మధ్య కరగ పూజారి మల్లెలతో సింగారించిన కరగను ఎత్తుకుని గ్రామంలో ఊరేగారు. పెద్దసంఖ్యలో భక్తులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వరకూ వేడుక జరిగింది.

జూన్‌లో మంగళూరుకు

వందేభారత్‌ రైలు

యశవంతపుర: బెంగళూరు–మంగళూరు వందేభారత్‌ రైలును జూన్‌ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ తెలిపారు. మంగళూరు రైల్వే జంక్షన్‌ను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఆరోజు దేశంలో పలు వందే భారత్‌ రైళ్లను మోదీ ప్రారంభిస్తారన్నారు. సుకలేశపుర–కుక్కే సుబ్రమణ్య మార్గంలో 55 కిలోమీటర్ల మేర ట్రాక్‌ విద్యుదీకరణ పనులు ముగిశాయి, బెంగళూరు–మంగళూరు మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి కావలసి ఉందని మంత్రి తెలిపారు.

వీకెండ్‌ సరదాలో విషాదం

కరెంటు షాక్‌తో టెక్కీ మృతి

యశవంతపుర: సరదాగా వీకెండ్‌ గడుపుదామనుకున్న టెక్కీ జలసమాధి అయ్యారు. నదిలో రబ్బరు బోటులో వేగంగా విహరించే సమయంలో అనూహ్యంగా కరెంటు షాక్‌ కొట్టి ఐటీ ఇంజనీరు మృతి చెందిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా జోయిడా తాలూకా గణేశగుడి వద్ద కాళీ నదిలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మహేశ్‌ (27) మృతుడు. ఈయన బెంగళూరులో టెక్కీగా పనిచేసేవాడు. వీకెండ్‌ కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఓ రిసార్ట్‌లో బసచేసి, అక్కడే నదిలో ర్యాఫ్టింగ్‌ చేయడానికి వెళ్లారు. నదిలో నుంచి పడవలోకి ఎక్కుతుండగా పక్కనే రిసార్టుకు చెందిన పెద్ద పంపుసెట్టు నుంచి కరెంటు నీటిలో ప్రసారమైంది. దీంతో మహేశ్‌కు షాక్‌ తగిలి నీట మునిగి మరణించాడు. మిగతావారికి కూడా షాక్‌ తగిలింది కానీ అంత ప్రభావం చూపించలేదు. అతని మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాఫ్టింగ్‌ చేసే ప్రాంతాలలో ఇలాంటి పంపుసెట్ల అమర్చవద్దని స్థానికులు హెచ్చరించినా రిసార్ట్‌ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ప్రమాదంలోనూ

చైన్‌ స్నాచింగ్‌

యశవంతపుర: యాక్సిడెంటులో తీవ్ర గాయాల పాలైన మహిళ మీద కనికరం లేకుండా ఆమె చైన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ అమానుష సంఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కొల్లూరులో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న కొల్లూరు వద్ద కేరకు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న జీపును చేపల లారీ ఢీకొంది. జీపులోని జ్యోతి, అరియా అనూఫ్‌లకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదంతో వాహనాలు నిలిచిపోయి గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో ఎవరో అపస్మారకంలో ఉన్న జ్యోతి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను తెంచుకున్నారు. తరువాత ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బంగారు చైన్‌ పోయిందని బంధువులు కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement