సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులు
నితిన్ నబిన్‌కు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహూకరిస్తున్న నేతలు
బనశంకరి: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఉండరాదని, బెంగాల్‌లో మాదిరిగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సూచించారు. ఆదివారం బెంగళూరు మల్లేశ్వరంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.
కలిసికట్టుగా పనిచేయాలి
పార్టీ చీఫ్ హోదాలో తొలిసారి వచ్చిన సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. రాష్ట్ర బీజేపీ పనితీరుపై పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై కిందిస్థాయి నుంచి పోరాటం చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై వివరించాలన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో పార్టీ బలోపేతం, పోరాటం సాగించాలని స్పష్టం చేయడం గమనార్హం. ఏ పోరాటమైనా అందరూ కలిసికట్టుగా నిర్వహించాలి, బూత్ స్థాయి నుంచి మొదలు పెట్టాలి, బెంగాల్ తరహాలో కార్యకర్తలు, నేతలు గ్రౌండ్‌లోకి దిగి పార్టీని బలోపేతం చేయాలి. నేడే ఎన్నికలు అనే మాదిరిగా చురుకుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని ఉద్బోధించారు. అలా చేస్తేనే గ్రేటర్ బెంగళూరు ఎన్నికలలో గెలుపొందవచ్చు, గ్రేటర్‌లో గెలిస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయం సులభమౌతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే శాసనసభ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. కేవలం మీడియా ప్రకటనలు, పోస్టులకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నుంచి పోరాటమే ప్రధానమ్నారు.
కాంగ్రెస్ సర్కారు విఫలం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ప్రతి మంత్రి అవినీతిలో నిమగ్నమయ్యారని, సీఎం కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని నితిన్ దుయ్యబట్టారు. ధరలు పెరిగాయని, ప్రజల జీవితానికి గ్యారంటీ లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలు అదృశ్యం అవుతున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను తొలగించకుండా నిఘా పెట్టాలని నితిన్ నబిన్ సూచించారు. మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్లు అశోక్, శ్రీరాములు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ నితిన్ నబిన్ పిలుపు
పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష


