బనశంకరి: విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లో అమర్చిన యుఎస్‌బీ చార్జింగ్ సాకెట్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జింగ్ పెట్టరాదని సైబర్ క్రైం పోలీసులు సలహా ఇచ్చారు. ఇలా చార్జింగ్ పెట్టడం వల్ల మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్లు, ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల వివరాలు సహా వ్యక్తిగత సమాచారం సైబర్ వంచకుల చేతుల్లోకి వెళుతుందని హెచ్చరించారు. దీనిని మాల్‌వేర్ ప్రమాదం, జ్యూస్ జాకింగ్ అనే పేరుతో వర్ణించింది. తద్వారా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులో దోచేస్తారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఉంటే వాటి ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ప్రమాదముంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు వంటివాటిని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు, నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిస్తే మరింత తీవ్ర ముప్పు తప్పదు. వ్యక్తిగత సమాచారాన్ని డార్క్‌వెబ్‌లోనూ విక్రయాలకు ఉంచి సొమ్ము చేసుకుంటారు.
సొంత చార్జర్, పవర్ బ్యాంక్ మేలు
బయట ప్రదేశాల్లో సొంత చార్జర్ ద్వారా చార్జింగ్ చేసుకోవడం, లేదంటే పవర్‌బ్యాంకును ఉపయోగించడం మేలు. ప్రయాణాలు చేసేవారు పవర్‌బ్యాంక్ దగ్గర ఉంచుకోవాలి. పబ్లిక్ యుఎస్‌బీ ద్వారా చార్జింగ్ చేస్తే.. యుఎస్‌బీ డేటా బ్లాకర్ సాధనం వాడాలి. మొబైల్ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ తెరపై అలో డేటా యాక్సెస్ అని అడిగితే తిరస్కరించాలని సూచించారు.


