విద్యుత్ కోతలతో
● బళ్లారిలో రోజుకు నాలుగైదు గంటలు విద్యుత్ బంద్ ● మూతపడుతున్న పరిశ్రమలు
● ఉపాధి కోల్పోతున్న వేలాది మంది కార్మికులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు
సాక్షి, బళ్లారి: చారిత్రాత్మక ప్రాధాన్యంతో పాటు అపార ఇనుప ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన బళ్లారి, జీన్స్ దుస్తుల తయారీలో కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ తయారయ్యే జీన్స్ దుస్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. జీన్స్ పరిశ్రమలో పని చేసే యువతీ, యువకులు రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. నగరంలో అనేక మంది తమ ఇళ్ల వద్దనే జీన్స్ ప్యాంట్లు, ఇతర దుస్తులు కుట్టి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ యజమానులు మెటీరియల్‌ను కార్మికుల ఇళ్లకే అందజేయడంతో ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కలుగుతోంది.
సంక్షోభంలో జీన్స్ పరిశ్రమ
అయితే ఇటీవల పెరిగిన విద్యుత్ కోతలు జీన్స్ పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. నగరంలో రోజూ నాలుగు నుంచి ఐదు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదు. ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీన్స్ తయారీలో కీలకమైన వాషింగ్ యూనిట్లు పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటాయి. జీన్స్‌కు రంగు, మెత్తదనం, డిజైన్, ఫినిషింగ్ ఇచ్చే భారీ యంత్రాలు విద్యుత్ లేకపోతే పని చేయవు. దీంతో అనేక యూనిట్లు పనులు నిలిపివేయాల్సి వస్తోంది.
పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
కొంతమంది జనరేటర్లతో పరిశ్రమలను నడిపిస్తున్నప్పటికీ డీజిల్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమవుతోందని యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అవసరమైన కెమికల్స్ దిగుమతిలో సమస్యలు నెలకొన్నాయి. ఇప్పుడు విద్యుత్ కోతలు కూడా తోడయ్యాయి. దీంతో జీన్స్ పరిశ్రమ మరింత కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో మిషన్లు ఆగిపోతున్నాయి. గంటల తరబడి పనిలేక ఎదురుచూడాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.
జీన్స్ దుస్తులు కుడుతున్న కార్మికులు దుకాణంలో జీన్స్ ప్యాంట్ల విక్రయాలు
ఉపాధి కోల్పోయే పరిస్థితి
విద్యుత్ సమస్యల కారణంగా వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బళ్లారితో పాటు విజయనగర, రాయచూరు, కొప్పళ, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన యువత కూడా ఇక్కడే స్థిరపడి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. నగరంలో 60కు పైగా జీన్స్ యూనిట్లు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలి. జీన్స్ షాపుల యజమానులు, కార్మికులు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.
– జయలక్ష్మి,
పాయింట్ బ్లాంక్ జీన్స్ కంపెనీ ఎండీ


