సాక్షి బళ్లారి: అధికారం చేతిలో ఉంది కదా అని బరితెగించి వంక పొరంబోకు భూమిని ఆక్రమించి సైట్లు వేసి విక్రయించిన కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త శివరాజుతో పాటు 13 మందిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం సిటీ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు మెరుపు దాడి చేసి నగరంలోని 7వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్ సమీపంలోని వంక పొరంబోకు భూమి ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తాము డబ్బు ఇచ్చి స్థలాలు కొనుగోలు చేశామని రెవెన్యూ అధికారులతో కంటతడి పెట్టుకున్నారు. ఒక్కో స్థలానికి రూ.2 లక్షలు ఇచ్చి స్థలాలు కొనుగోలు చేశామని అధికారులతో చెప్పారు. సమగ్ర దర్యాప్తు చేసిన అధికారులు స్థానిక కార్పొరేటర్ భర్త శివరాజుతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో తమ ప్రమేయం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త పేర్కొనడం గమనార్హం. నగరంలో పలు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఎత్తిపోతల పథకాలతో
రైతులకు మేలు
రాయచూరు రూరల్: రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్, యాదగిరి జిల్లా సురుపుర శాసన సభ్యుడు రాజా వేణుగోపాల నాయక్ పేర్కొన్నారు. యాదగిరి జిల్లా సురుపుర తాలుకా తీర్థక్రాస్ బూదిహళ పీరాపూర్ వద్ద ఎత్తిపోతల పథకానికి అనుమతి లభించిందని తెలిపారు. ఆదివారం తీర్థక్రాస్ వద్ద ఇందుకు సంబంధించిన పనులపై అధికారులతో చర్చించారు. రూ.150 కోట్లతో 1,000 ఎకరాల భూమికి నీరందించే పథకానికి సంబంధించి పనులను పరిశీలించారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ నియోజక వర్గం మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి సర్కార్ రూ.182 కోట్లతో 16000 ఏకరాలు భూమికి నీరందించే పథకానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.
ధరలు పెంచడం సరికాదు
కెజీఎఫ్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం దుర్మార్గం అని సీపీఎం కార్యకర్తలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని అండర్‌సన్ పేట సర్కల్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ నగరసభ సభ్యుడు తంగరాజ్ మాట్లాడుతూ.. యుద్ధ నెపంతో కేంద్రం ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు జీవించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని ఆరోపించారు. కారులో బెంగుళూరుకు వెళ్లే ఎమ్మెల్యే రూపా శశిధర్‌కు రైలులో ప్రయాణించే కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు నాణ్యతగా చేపట్టాలి
కోలారు: నగరంలోని సి.భైరేగౌడ కాలనీలో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఒక్కలిగ సముదాయ విద్యార్థినుల హాస్టల్ వసతి నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించండి. సాధ్యమయితే రీ టెండర్ చేయాలని ఒక్కలిగ సంఘం పదాధికారులు తీర్మానం చేశారు. ఆదివారం నగర సమీపంలోని ప్రైవేట్ రిసార్టులో ఒక్కలిగ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత కాంట్రాక్టర్ పనులను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. సంఘం రాష్ట్ర డైరెక్టర్ కలుగజేసుకుని దీనిని సరి చేయాలన్నారు. సమావేశంలో ఒక్కలిగ సంఘం రాష్ట్ర డైరెక్టర్ కోనప్పరెడ్డి, సముదాయ ప్రముఖులు ఆర్.ప్రభాకర రెడ్డి, సీసంద్ర గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి
కోలారు: విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా బాగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం నగరంలో చన్నయ్య రంగమందిరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.103 కోట్ల నిధులను జిల్లాలో కళాశాలల అభివృద్ధికి మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో కళాశాలల అభివృద్ధికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి భైరతి సురేష్, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎం.సి.సుధాకర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీ ఎం.మల్లేష్ బాబు మాట్లాడుతూ.. మహిళా కళాశాల విద్యార్థినులు చదువులో, క్రీడల్లో రాణిస్తుండడం సంతోషించదగిన విషయమన్నారు. నేడు మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కోలారులో మహిళా కళాశాలకు ఒక ఇతిహాసం ఉందన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్య అందుతోందన్నారు.


