ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలపై ఆగ్రహం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

ముగ్గురు అధికారులు సస్పెండ్‌

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ కార్యాలయంలో జల్సాలపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు చేసే దేవాలయాలుగా భావించే సర్కారు కార్యాలయాలను కొంతమంది అధికారులు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించారు. రాయచూరు జిల్లా లింగసూగురులో పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం కార్యాలయంలో మందు పార్టీలు చేసుకున్నారు. రాత్రి వేళ్లలో అధికారులు పార్టీలు చేసుకుంటూ క్లబ్‌గా మార్చేయడంతో ఉన్నత స్థాయి అధికారులు స్పందించారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ ఏఈఈ హనుమప్ప, సిబ్బంది రామణ్ణ పూజారి, హనుమంతును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఘనంగా

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హొసపేటె: హొసపేటె తాలూకా కమలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999–2002 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు విశ్వమూర్తి మాట్లాడుతూ.. ఒక ఉపాధ్యాయునికి లభించే ఈ గౌరవం ప్రపంచంలోని ఏ వృత్తిలోనూ ఎవరికీ లభించదన్నారు. మీకున్న జ్ఞానాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతే అది పరిపక్వంగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధే ఉపాధ్యాయుడి నిజమైన విజయం అన్నారు. మంచి విద్యార్థులు మంచి ఉపాధ్యాయులు కాగలరన్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలలో సంస్కారం తగ్గిపోతోందన్నారు. మీరు చేసే విధంగానే మీ పిల్లలలో సంస్కార బీజాలు నాటండి. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించడం వారికి నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సురేఖ, సుధ, వీరేశ్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధునిక ముస్లిం లీగ్‌

హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం వివిధ 52 కేసులను రద్దు చేయడం ద్వారా మతాంధ శక్తులకు ప్రోత్సాహం అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మండిపడ్డారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్‌ బుజ్జగింపు కుహాన రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్‌ ఆధునిక ముస్లిం లీగ్‌ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాక్రోచ్‌ భయం కాంగ్రెస్‌కే కానీ బీజేపీకి లేదని తేల్చి చెప్పారు. కాక్రోచ్‌ జనతా పా ర్టీ ఉన్న ఫలంగా పుట్టుకు రావడం వల్ల కాంగ్రెస్‌ భయపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ఇప్పటికే పూర్తిగా మనుగడ కోల్పోయిందని తెలిపారు.

ఈతకెళ్లి బాలుడు మృతి

రాయచూరు రూరల్‌: స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు నీటమునిగి మృతి చెందిన ఘటన బెళగావి జిల్లా అథణిలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సమర్థ పనాళకర్‌ (16) మిత్రులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పనాళకర్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

గుండెపోటుతో

ఉపాధి కూలీ మృతి

రాయచూరు రూరల్‌: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా చించోడిలో చోటు చేసుకుంది. ఆదివారం ఉపాధి పనికి వెళ్లిన నాగప్ప (56)కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. చికిత్స నిమిత్తం జాళ్లహళ్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. జాళ్లహళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement