గాలీవాన హోరు | - | Sakshi
Sakshi News home page

గాలీవాన హోరు

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

హొసపేటె: జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, కొట్టూరు తాలూకాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హొసపేటె తాలూకా ధర్మసాగర్‌ గ్రామంలో కే.తిమ్మనగౌడ ఇంటి ప్రహరీ కూలిపోయింది. పలువురు ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లోని విత్తనాలు, ఎరువులు కొట్టుకుని పోయాయి. అదే విధంగా తాలూకాలోని భువనహళ్లి, గాదిగనూరు గ్రామాల్లో రైతుల పొలాలు, విద్యుత్‌ కేంద్రంలోకి నీరు చేరింది. కొట్టూరు తాలూకా, ఉజ్జినిలోని కేఈబీ విద్యుత్‌ కేంద్రంలోకి నీరు చేరడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రాత్రంతా విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు చీకట్లో ఉండిపోయారు. అలాగే నగరంలోని మురికి వాడల్లోని ఇళ్లలోకి నీరు చేరి, భారీ నష్టం కలిగించింది. బైలువద్దిగేరి గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. హొసపేటె–బళ్లారి మధ్య జాతీయ రహదారి–67 పై జరుగుతున్న రోడ్డు పనుల్లో జాప్యం కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నీరు తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గాదిగనూరు గ్రామస్తులు రహదారిపై నిలబడి నిరసన చేపట్టారు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయించారు.

పిడుగుపాటుకు ఎద్దులు, మేకల మృతి

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రహదారులు బురదమయం అయ్యాయి. గాంధీ చౌక్‌, మూన్నూరు వాడి, నగరంలో కూరగాయల మార్కెట్‌లోకి వర్షపు నీరు చేరింది. అరికెరలో పిడుగు పాటుకు రెండు ఎద్దులు, ఐదు మేకలు మృతి చెందాయి. అలాగే సింధనూరు తాలుకాలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. నిప్పు రవ్వలు పడటంతో గడ్డివాములు కాలిపోయాయి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మఠాధిపతి సుబుదేంద్ర తీర్ధ శ్రీ పాదంగల్‌ కళ్యాణ మంటపం తాళాలు తెరపించి వసతి సౌకర్యం కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement