రాయచూరు రూరల్: ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలో హైదరాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని సాహితీవేత్త ఆర్‌కే హుడిగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో హైదరాబాద్–కర్ణాటక జనాందోళన ఆధ్వర్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(జె)అమలు విషయంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగం తదితర రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మండలి పేరుకే పరిమితమైందని ఆరోపించారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఏటా రూ.1,000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మొసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర కుష్టిగి, బసవరాజ్, నాగన గౌడ, చామరస మాలి పాటిల్, బసన గౌడ, గంగాధర నాయక్, రజాక్ ఉస్తాద్, జాన వెస్లీ, ధనరాజ్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.


