జయ జయ వేంకటేశా.. | - | Sakshi
Sakshi News home page

జయ జయ వేంకటేశా..

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

మాలూరు: తాలూకాలో మరో తిరుమల క్షేత్రంగా పేరుపొందిన చిక్క తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు గోపాలకృష్ణ భారద్వాజ్‌, ఎన్‌ శ్రీధర్‌, కార్తీక్‌ స్వామి నేతృత్వంలో ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు.

ఏనుగు కన్నుమూత

మైసూరు: చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనబెట్ట మూల్కి బెట్ట అడవిలో ఓ ఆడ ఏనుగు మృత్యువాత పడింది. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సుగల ఏనుగు సహజ మరణం పొందినట్లు అనుమానిస్తున్నారు. అడవిలో కాలిబాట పక్కన కళేబరం ఉంది. పశువైద్యులు మాట్లాడుతూ ఏనుగులకు వయస్సైన తర్వాత ఆహారాన్ని నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తమ గుంపు నుంచి వేరైపోతాయి. కొంత కాలానికి సహజ మరణానికి గురవడం సాధారణమని తెలిపారు. ఏసీఎఫ్‌ మహాలక్ష్మి, ఆర్‌ఎఫ్‌ఓ సతీష్‌ గస్తీ సిబ్బందితో కలిసి ఏనుగు కళేబరాన్ని పరిశీలించి పూడ్చిపెట్టారు.

భర్త హత్య కేసులో

భార్యకు నో బెయిలు

శివాజీనగర: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో భార్యకు బెయిల్‌ ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. నిందితురాలు చిత్రదుర్గకు చెందిన సునీత. ఈమె ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నెలలు దాటినా తనకు స్థానిక కోర్టు బెయిలు ఇవ్వలేదని, మీరైనా మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ పెండింగ్‌లో ఉంది, ఈ దశలో నిందితురాలికి బెయిల్‌ ఇస్తే సాక్షులపై ప్రభావం చూపవచ్చని, అందుచేత బెయిలు ఇవ్వడం కుదరదని జస్టిస్‌ వి.శ్రీషానంద ధర్మాసనం తీర్పు చెప్పింది. సాధారణ కారణాలను చూపి బెయిలు అడగరాదని, కేసు విచారణ ముగిసిన తరువాత బెయిల్‌కు ప్రయత్నించాలని సూచించారు.

ఆ పల్లెకు ఆర్టీసీ బస్సు

తుమకూరు: బస్సు సౌకర్యం లేని తుమకూరు జిల్లా సరిహద్దులోని చిక్కనాయకనహళ్లి తాలూకా సింగాపుర గ్రామానికి ఎట్టకేలకు కేఎస్‌ ఆర్టీసీ బస్సు వచ్చింది. ఈ నెల 21 నుంచి బస్సు సేవలు మొదలయ్యాయి. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం ముందు బస్సుకు పూజలు చేసి, సర్వీసు కోసం పోరాడినవారిని సన్మానించారు.

ఏడాది జైలుశిక్ష..

ఒక్కరోజుతో సరి

శివాజీనగర: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్‌ అహ్మద్‌ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్‌ గాయపడి, చేతికి రాడ్‌ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్‌ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్‌ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement