శివాజీనగర: ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న భయానక ఎబోలా వైరస్ వ్యాధి కన్నడనాడుకు గుబులు పుట్టిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ని ప్రకటించింది. వ్యాధి పీడితులు ప్రవేశించకుండా విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ప్రయాణికులకు పరీక్షలు జరపాలని సూచించడమైనది. బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉండడమే ఈ ఆందోళనకు కారణం. పొరపాటున ఎబోలా కేసులు వస్తే ఆర్థిక రాజధాని బెంగళూరుకు తీవ్ర ఇబ్బంది తప్పదు.
ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
అనుమానిత లక్షణాలు కనిపిస్తే తక్షణమే ప్రత్యేక వార్డుల్లో చేర్పించాలి. బెంగళూరు, మంగళూరు నగర ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, రక్షణాత్మక కిట్‌లు, వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఎబోలా ప్రాథమిక లక్షణాలు
తీవ్ర జ్వరం, తలనొప్పి – అతిగా ఆయాసం రావడం – గొంతు నొప్పి –వాంతులు, విరేచనాలు, – కడుపు నొప్పి –కళ్లు ఎర్రగా కావడం – తీవ్రరూపం దాల్చితే శరీరం లోపల అవయవాల్లో రక్తస్రావం అవుతుంది.
ఆఫ్రికన్లపై 21 రోజుల నిఘా: మంత్రి
ఎబోలా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశఽంలో ఇప్పటి వరకు ఒక్క కేసూ రాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాం. ఆఫ్రికన్ దేశాలైన ఉగాండా, కాంగో వంటి దేశాల నుంచి వచ్చిన వారిని 21 రోజుల పాటు నిఘాలో ఉంచుతాం, రోగ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి తక్షణమే సమాచారం ఇవ్వాలని చెప్పామని వివరించారు. కాగా, ప్రధాని మోదీ తీరు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆయన ఆరోపించారు. మోదీ ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియో పోస్టు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
ఆఫ్రికా టు
బెంగళూరు
రాష్ట్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక
విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆఫ్రికా
నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు
ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు రెడీ


