జోరుగా బీపీఎల్‌ కార్డుల రద్దు | - | Sakshi
Sakshi News home page

జోరుగా బీపీఎల్‌ కార్డుల రద్దు

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

సాక్షి, బళ్లారి: అనర్హ బీపీఎల్‌ కార్డుదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పేదలకు అందాల్సిన ఉచిత బియ్యం, ఇతరత్రా సదుపాయాలు ఆదాయ పన్ను చెల్లించేవారి వద్ద కూడా బీపీఎల్‌ కార్డులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనర్హుల వద్ద ఉన్న బీపీఎల్‌ కార్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సంబంధిత అధికారులు అనర్హుల వద్ద ఉన్న బీపీఎల్‌ కార్డులను తొలగించే ప్రక్రియను చురుగ్గా చేపడుతున్నారు. గత మూడు నెలలుగా జిల్లాలో దాదాపు ఐదు వేలకుపైగా బీపీఎల్‌ కార్డులను తొలగించారు. ప్రభుత్వ ఆదేశాలతో జోరుగా చేపడుతున్న బీపీఎల్‌ కార్డుల తొలగింపు ప్రక్రియతో నిజమైన లబ్ధిదారులకు దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు ఒకలా ఉంటే అధికారులు మరోలా వ్యవహరిస్తుండటంతో పాటు అర్హులైన వారికి సంబంధించిన బీపీఎల్‌ కార్డులను కూడా కొన్నింటిని తీసివేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పెషల్‌ డ్రైవ్‌తో కార్డుల రద్దు

పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరకపోతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఎక్కువగా నష్టపోతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తూ బీపీఎల్‌ కార్డుల తొలగింపు చేపడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఒక్కొక్కరికి ఇస్తున్న ఐదు కేజీల బియ్యంతో పాటు మరో ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆ హామీని అమలు చేయడంతో ప్రతి నెల బీపీఎల్‌కార్డు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు పలు పథకాలకు సంబంధించి బీపీఎల్‌ కార్డు తప్పనిసరి కావడంతో సామాన్య, పేద కుటుంబాలతో పాటు మధ్య తరగతి, ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఏదో విధంగా పైరవీలు చేసి బీపీఎల్‌ కార్డులు పొందారు. ఆకలితో ఉన్నవారికి ఉచిత బియ్యం అందించాలనే సంకల్పంతో అమలు చేసిన ఉచిత బియ్యం 60 శాతం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

తక్కువ ధరకే రేషన్‌ బియ్యం కొనుగోలు

ప్రతి నెల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బీపీఎల్‌కార్డు దారుల నుంచి ఉచిత బియ్యాన్ని తక్కువ ధరకే తీసుకుని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న దృశ్యాలు, పట్టుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. ప్రతి నెల ఉచిత బియ్యం అందజేయడం ప్రారంభిస్తే, వ్యాపారులు రంగ ప్రవేశం చేసి, లబ్ధిదారులతో కిలో బియ్యాన్ని కేవలం రూ.10లకే కొనుగోలు చేసి, వాటికి మెరుగులు దిద్ది దేశ, విదేశాలకు ఎగుమతులు చేయడం సర్వసాధారణంగా మారింది. అధికారులు దాడులు చేయడం కూడా సర్వసాధారణమే. తూతుమంత్రంగా దాడులు చేయడం, అక్కడక్కడ రేషన్‌ బియ్యం పట్టుకోవడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అక్రమంగా ఉచితంగా పొందిన బీపీఎల్‌కార్డులు రద్దు చేస్తే కొద్ది వరకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్టు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అక్రమంగా పొందిన బీపీఎల్‌కార్డులను తొలగించేస్తున్నారు.

5 వేల అక్రమ బీపీఎల్‌ కార్డుల తొలగింపు

జిల్లాలో 24,776 అంత్యోదయ కార్డులు, 56,377 ఏపీఎల్‌ కార్డులు, 2,74,280 బీపీఎల్‌కార్డులు ఉన్నట్లు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. అక్రమంగా పొందిన బీపీఎల్‌కార్డులను మూడు నెలల్లో ఐదు వేల దాకా తొలగించడంతో పాటు ప్రతి రోజు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న బీపీఎల్‌ కార్డులను తొలగించిన వారికి ఏపీఎల్‌ కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీఎల్‌కార్డులు తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్డులు పొందిన ఆదాయ పన్ను చెల్లించే వారి కార్డుల ఏరివేతను కూడా చేపడుతున్నామన్నారు. పేదల హక్కుల్లో ధనికులు కూడా భాగస్వామ్యం కావడంతో వారి కార్డులను తొలగిస్తున్నట్లు సంబంధిత అఽధికారి తెలిపారు. ఒకవేళ నిజమైన లబ్ధిదారుల కార్డులను పొరపాటుగా ఎక్కడైనా తొలగించి ఉంటే బాధితులు అధికారుల దృష్టికి తెస్తే కార్డులను తిరిగి పొందేందుకు అవకాశం ఉందని, నిజమైన బాధితులు, పేదలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

అనర్హ లబ్ధిదారుల్లో మొదలైన దడ

చాపకింద నీరులా కార్డుల తొలగింపు

అర్హుల కార్డుల తీసివేతపై విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement