● 12 మందికి తీవ్ర గాయాలు
● ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
● తృటిలో తప్పిన పెను ముప్పు
● కొప్పళ జిల్లాలో రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి: హైదరాబాద్ నుంచి గోవాకు విహారయాత్రకు బయలుదేరిన వారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారు జామున కర్ణాటకలోని కొప్పళ నగరానికి సమీపంలోని చుక్కనకల్ వద్ద టెంపో ట్రావెలర్ టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 12 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో ఓ చిన్నారితో పాటు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కొప్పళ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని కొప్పళ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 28 నుంచి
ముంగారు ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 26 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా జూన్ 28న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభిస్తామన్నారు. 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల రాతిదూలం లాగే పోటీలు, 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలు జరుగుతాయన్నారు. 29న లక్ష్మిదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 28 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారన్నారు. సమావేశంలో శ్రీనివాసరెడ్డి, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తిలున్నారు.
26న వ్యవసాయ మేళా
బళ్లారిటౌన్: రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, వైజ్ఞానిక విధానంలో విత్తన ప్రక్రియ, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, వ్యవసాయ ఉద్యాన, పట్టు, చేపల పెంపకం తదితర శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ(కృషి) మేళాను చేపట్టినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు అవార్ మంజునాథ్, గౌరవ కార్యదర్శి కేసీ సురేష్‌బాబు తెలిపారు. శనివారం బీడీసీసీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పలువురు నిపుణులను కూడా ఆహ్వానించి రైతులకు నూతన వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ కులపతి ఎన్.హనుమంతప్పతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశానికి దాదాపు 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. నూతన పరిజ్ఞాన పరికరాల ప్రదర్శనకు 75 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, ప్రముఖులు మర్చేడు మల్లికార్జున గౌడ, రామచంద్ర, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్టేడియం పనులు
చురుగ్గా చేపట్టండి
రాయచూరు రూరల్: కలబుర్గిలో క్రీడా మైదానం పనులు చురుగ్గా చేపట్టాలని నూతన జిల్లాధికారి ఇక్రమ్ శరీఫ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాధికారి ఇతర అధికారులతో కలిసి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో మౌలిక సౌకర్యాలతో పాటు క్రీడాకారులకు అనుకూలమయ్యేలా పనులు కొనసాగించాలని సూచించారు. అధికారులు సంగమేష్, రాహుల్ కాంబ్లే, అభిషేక్, సంజయ్, ప్రవీణ్, అశోక్, రాజు పాల్గొన్నారు.


