రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బళ్లారి, బీదర్, యాదగిరి జిల్లాల్లోని రైతుల కోసం ప్రతి నెల రెండవ, నాలుగవ శనివారాల్లో రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు ప్రత్యేక సంతలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ కళాశాల అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పండించిన పంటలు, కూరగాయలు, పండ్ల కొనుగోలుకు రైతులు ఎద్దులబండ్లలో తరలి వచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, అధ్యాపకులు మల్లికార్జున, అయ్యన గౌడర్, గురురాజ్ సుంకద, బసవణ్ణప్ప, రాజణ్ణ, ప్రభురాజ్, జాగృతి దేశ్‌మానెలున్నారు.
ప్రభుత్వ పాఠశాలల
విలీనం తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లో విలీనం చేయడం తగదని ఏఐడీఎస్‌ఓ పేర్కొంది. శనివారం దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆందోళనకారులు మాట్లాడారు. దేవదుర్గ తాలూకాలోని ఆల్కోడ్‌కు అడకలగుడ్డ, సింగేరిదొడ్డి, ఉలకబండ, కుర్లేకరదొడ్డి ప్రాథమిక పాఠశాలలను చేర్చరాదని, ఆ ప్రయత్నం విరమించుకోవాలని ఒత్తిడి చేశారు.
తండ్రీ, కొడుకు నీటి పాలు
రాయచూరు రూరల్: పొలంలోని నీటి గుంటలో కాలు జారి పడి తండ్రీ, కొడుకు మరణించిన ఘటన హావేరి తాలూకాలోని ఆలదకట్టిలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం తండ్రీకొడుకులిద్దరూ నడుచుకుంటూ పొలం వైపు వెళ్లారు. ముందుగా శరత్ హంసబావి(8) కుంటలో పేరుకున్న పాచిని చూడకుండా కాలు జారిపడ్డాడు. కొడుకును రక్షించడానికి ప్రయత్నించిన తండ్రి శంభులింగప్ప(48) కూడా మరణింంచారు. హావేరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆలదకట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
మురుగు కాలువల్లో
పూడిక తొలగింపు
రాయచూరు రూరల్: నగరంలోని మురుగు కాలువల్లో పూడికను తొలగించారు. నగరంలోని బంగికుంట, కోట బస్టాండ్, అరబ్ మొహల్లా, షియా తలాబ్, ఖాదర్‌గుండ, నవాబ్‌గడ్డ, మడ్డిపేట, బైరూన్‌కిల్ల, మడివాళనగర్, ఇందిరానగర్, సుఖాణి కాలనీల్లో మురుగు కాలువల్లో చెత్తాచెదారం నిండింది. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడేందుకు నగరంలోని 38 మురుగు కాలువల్లో త్వరితగతిన పూడిక తొలగింపు చేపట్టినట్లు నోడల్ అధికారి కృష్ణ శావంతగేర తెలిపారు.
తేనెటీగల దాడిలో రైతు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రళ్లిలో ఉదయం వ్యవసాయ పనుల్లో ఉండగా తేనెటీగలు దాడి చేయడంతో రైతు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మృతుడిని తళవార హనుమంతప్ప(62)గా గుర్తించారు. ఇతనిపై తేనెటీగల గుంపు దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మొదట తంబ్రళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, ప్రాథమిక చికిత్స తర్వాత హగరిబొమ్మనహళ్లి ఆస్పత్రికి, అనంతరం కొప్పళలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హనుమంతప్ప మరణించారు. ఈ ఘటనపై తంబ్రళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


