సాక్షి,బళ్లారి: బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చారని ప్రచారం సాగటంతో పాటు వలసదారుల వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో బెళగావి పోలీసులు హై అలర్ట్ అయ్యారు. బెళగావి డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బెళగావిని జల్లెడ పట్టారు. బెళగావి బస్టాండులో 20 మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శ్రీరామసేన జిల్లాధ్యక్షుడు రవి కుకిత్కర్‌తో పాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హుబ్లీ నుంచి వచ్చిన మూడు బస్సులను కూడా తనిఖీ చేశారు. బెళగావి బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము బంగ్లాదేశీయులు కాదని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారమని, అక్కడ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఉపాధి కోసం కర్ణాటకకు వచ్చినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు. 20 మందిని అదుపులోకి తీసుకుని వారి ఆధార్, ఓటరు ఐడీ, ఇతరత్ర స్థానిక రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు కూలంకుషంగా పరిశీలించారు. ఓటరు ఐడీ, ఽఆధార్‌కార్డులతో పాటు ఫోన్ నంబర్ ద్వారా ఏయే దానికి లింకు అయింది, వారికి ఎక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయో కూడా నిఘా ఉంచి పరిశీలన చేశారు. పోలీసులు అన్ని విధాలుగా పరిశీలిచిన తర్వాత బంగ్లాదేశీయులు కాదని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు వచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండ్‌లో 20 మంది
పోలీసుల అదుపులోకి
విచారణలో పశ్చిమబెంగాల్ కార్మికులుగా గుర్తింపు


