బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో చాలా ఏళ్లుగా డిమాండ్‌గా ఉన్న బళ్లారి రోడ్డులో వంతెన పనులు ఎమ్మెల్యే చొరవతో చురుగ్గా సాగుతున్నాయి. రూ.6 కోట్ల కేఆర్‌డీసీఎల్ నిధులతో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. బళ్లారి రోడ్డు నుంచి అల్లీపుర రోడ్డు వరకు మధ్యలో కాలువపై వంతెన, ఎర్రితాత మఠం వరకు నాలుగు లైన్ల సిమెంట్ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణ పనులతో అభివృద్ధి చేయనున్నారు. బళ్లారి రోడ్డు, అల్లీపురం రోడ్డులోని కాలువ గట్లపై 30 ఏళ్ల క్రితం వంతెనలు నిర్మించారు. అయితే అవి పూర్తిగా ధ్వంసమయ్యాయని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభురెడ్డి, సిద్దమ్మనహళ్లి హులప్ప, దమ్మూరు హనుమప్ప రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ అభివృద్ధి కోసం కేఆర్‌డీసీఎల్ నుంచి రూ.6 కోట్ల నిధులు కేటాయించి పనులు జరుపుతున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రస్తుతం కాలువలో బండరాయి పడినప్పటికీ యుద్ధ ప్రతిపాదికన పనులు సాగుతున్నాయన్నారు. రెండు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ నాగరాజ్ తెలిపారు. కాగా ఈ పనుల నాణ్యతను పీడబ్ల్యూడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వంతెన పనులు జరుగుతున్నందున వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే ఏర్పాట్లు చేశారు.


