రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగాకాంక్షుల పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు చెన్నబసవ డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 15 వేల నుంచి 20 వేల వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో కాలం గడపడం మాని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప కొత్త ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఏడాదికి రెండు మార్లు టీఈటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రిల్, చిత్రలేఖనం, సంగీత ఉపాధ్యాయులను నియమించాలన్నారు. విద్యాశాఖలో 79,694 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 22,595 మంది ఉపాధ్యాయులను నియమించుకోవాల్సి ఉందన్నారు. జిల్లాలో 1,175 అతిథి, 1,066 ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. వినోద్ కుమార్, వెంకటేష్, బసవరాజ్, కాశీనాథ్‌లున్నారు.


