భారీ వర్షానికి కుప్పకూలిన టెంట్లు, ఫ్లెక్సీ బ్యానర్లు
● అంతర్జాతీయ స్టేడియం
శంకుస్థాపనకు ఆటంకం
బొమ్మనహళ్లి : బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్ నాలుగో స్టేజ్‌లో అంతర్జాతీయ స్టేడియానికి శనివారం సీఎం శంకుస్థాపన చేయనుండగా గురువారం రాత్రి ఆకస్మిక ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ టెంట్ (పందిరి) పూర్తిగా ముక్కలై నేలమట్టమైంది. ఇనుప స్తంభాలు, భారీ షీట్లు, కటౌట్లు, స్వాగత బ్యానర్లు పెనుగాలులకు కొట్టుకుపోయాయి. గాలి తీవ్రతకు గూడ్స్ వాహనం బోల్తా పడిపోయింది. శనివారం నాటి ముహూర్తం కోసం మొత్తం పాలనా యంత్రాంగం సిద్ధంగా ఉన్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక షామియానా కేవలం గంట వర్షానికే పూర్తిగా ధ్వంసమైంది.
బనశంకరి: సిలికాన్‌సిటీ బెంగళూరు నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది. జయనగర, బసవనగుడి, రాజాజీనగర, విజయనగర, ఆర్‌టీ.నగర, శేషాద్రిపురం, చామరాజపేటె, జేపీ.నగర, సదాశివనగర తో పాటు 50కి పైగా ప్రదేశాల్లో 40కిపైగా భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కార్లు, బైకులు దెబ్బతిన్నాయి. స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజాజీనగరలో వెస్ట్ ఆఫ్‌కార్డ్స్ రోడ్డులో చెట్టు కూలి రోడ్డుబ్లాక్ కాగా సర్వీస్‌రోడ్డులో వాహనాలను మళ్లీంచారు. మహాలక్ష్మీలేఔట్ పైపులైన్ రోడ్డులో చెట్లు కూలి కార్లు ధ్వంసమయ్యాయి. చెట్టు తొలగించడం ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సగానికి పైగా చెట్టు తొలగించి పుట్‌పాత్‌లో వదిలిపెట్టి వెళ్లిన ఆరోపణలు వినిపించాయి. జీబీఏ పరిధిలో ఆరు కంట్రోల్ రూమ్‌లకు 600కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇళ్లలోకి నీరు చొరబడటం, విద్యుత్ అంతరాయం, చెట్లు విరిగిపడి రోడ్డుబంద్ కావడంపై ఫిర్యాదులు అందాయి. వర్షానికి కూలిపోయిన చెట్లు త్వరితగతిన తొలగించాలని జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్ నగరపాలికెలకు సూచన చేశారు.
రాజాజీనగర మోదీ ఆసుపత్రి వద్ద కారుపై కూలిన వృక్షం
చామరాజపేటె పచ్చప్ప సర్కిల్ వద్ద జలమయమైన దృశ్యం
చెట్ల తొలగింపులో జాప్యంపై
ఫిర్యాదుల వెల్లువ


