మహిళలపై నేరాలు కొనసాగడం దారుణం | - | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలు కొనసాగడం దారుణం

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

సాక్షి బెంగళూరు: దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. నేటి ఆధునిక కాలంలోనూ మహిళలు ఇప్పటికీ అక్కడక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు పటిష్ట చట్టాలు రూపొందిస్తున్నాయి. వారి రక్షణ కోసం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అతివలపై వేధింపులు, దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. వారిపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇక ఎంతో వేగంగా విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయి నగరంగా పేరొందిన బెంగళూరు నగరంలో కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.

మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టినా..

సిలికాన్‌ సిటీ బెంగళూరులో మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. అయితే ఈ చర్యలన్నీ కొద్దిమేర సత్ఫలితాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించడంలో విఫలం అవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశంలోనే మూడో స్థానంలో బెంగళూరు నిలిచింది. ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదిక– 2024 ప్రకారం దేశంలోని 19 ప్రధాన మెట్రో పాలిటన్‌ నగరాలకు గాను మహిళలపై జరుగుతున్న నేరాల పరంగా ఢిల్లీ, ముంబై తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో ఐటీ సిటీ బెంగళూరు నిలిచింది. మహిళలపై జరిగిన లైంగిక దాడులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు తదితరాలన్నీ కలుపుకుని 2024లో మొత్తం 4,748 కేసులు నమోదయ్యాయి. ఇక 2023లో ఈ సంఖ్య 4,870గా ఉండడం గమనార్హం.

గణనీయమైన మార్పులేమీ లేవు

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచార కేసుల్లో గణనీయమైన మార్పులు ఏమీ కనిపించలేదు. 2023లో 169 కేసులు నమోదైతే 2024లో ఆ సంఖ్య 168గా నమోదైంది. లైంగిక వేధింపుల కేసులు గత ఏడాది కంటే 30 శాతం మేర పెరిగాయి. 2023లో మొత్తం 210 లైంగిక వేధింపులు కేసులు నమోదు కాగా, 2024లో మొత్తం 180 లైంగిక వేధింపులు రికార్డయ్యాయి. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన కేసుల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మొత్తం 897 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసుల సంఖ్య 66గా ఉంది. ఇక వరకట్న వేధింపుల మరణాలు కూడా బెంగళూరులో పెరిగాయి. 2024లో బెంగళూరులో మొత్తం 25 వరకట్న వేధింపుల మరణాలు రికార్డయ్యాయి. వరకట్న మరణాల్లో జైపూర్‌ నగరంతో పాటు బెంగళూరు నాల్గో స్థానాన్ని పంచుకుంది.

ప్రతీకాత్మక చిత్రాలు

బెంగళూరులో మహిళలపై

అత్యాచారాలు ఎక్కువ

దేశంలోనే మూడో స్థానంలో

నిలిచిన సిలికాన్‌ సిటీ

బెంగళూరు వంటి మహానగరంలో మహిళలపై నేరాలు ఇంకా కొనసాగుతుండడం ఏమాత్రం మంచిది కాదని పలు మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రోజూ దినపత్రికల్లో లైంగిక దాడులకు సంబంధించిన అనేక కేసులు ప్రచురితం కావడం ఇంకా చూస్తూనే ఉన్నామని, ఇలాంటి తరుణంలో బాధితుల పక్షాన నిలబడి ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పోరాటం చేయాలని ఆయా సంఘాలు పిలుపునిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 19 మహానగరాల్లో నమోదైన మహిళలపై లైంగిక దాడి కేసుల్లో దాదాపు 28 శాతం భర్త లేదా బంధువులే నిందితులుగా ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ లెక్కలు చూస్తుంటే అర్థమవుతోందని చెబుతున్నాయి. కేవలం లైంగిక దాడులే కాకుండా 20.1 శాతం కిడ్నాప్‌ కేసులు కూడా నమోదవుతుండడం మహిళల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement