బనశంకరి: భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లి బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం బనశంకరీదేవీ మూలవిరాట్‌కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో విశేష అలంకరణచేసి పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.
పేదల ఓట్ల
తొలగింపునకు కుట్ర
● సర్‌పై డీసీఎం డీకే శివకుమార్
దొడ్డబళ్లాపురం: పేదల ఓట్లు తొలగించేందుకు ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్) సాకుతో కుట్ర చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ కార్యకర్తలు సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్‌ఏలకు సర్‌పై అవగాహన కల్గిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పిటిషన్ ఇవ్వాలన్నారు. లేకుంటే ఓటు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాగే జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఓటర్లు ఓటు కోల్పోతే అనేక ప్రభుత్వ పథకాలను పొందలేరన్నారు.
కాటేసిన కనురెప్ప
● కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
యశవంతపుర: తాగిన మత్తులో ఓ తండ్రి 13 ఏళ్ల కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా అంకోలా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తండ్రి క్రూరత్వ ఘటనను బాలిక చుట్టుపక్కల కుటుంబాలకు చెప్పటంతో ఈ విషయం బహిరంగమైంది. తక్షణం పక్కింటివారు అంకోలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి తండ్రిని అరెస్ట్ చేసి బాలికను అంకోలా ఆస్పత్రికి పరీక్ష నిమిత్తం తరలించారు.
ప్రగతి పరిశీలన
బనశంకరి: ప్రగతి, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి తదితర అవకాశాలను నిర్ణయించే దృష్ట్యా హెచ్‌ఎంటీ మెషిన్ అండ్ టూల్స్ లిమిటెడ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, ప్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాయకత్వ బృందాలతో శుక్రవారం కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. స్థానిక ఉత్పత్తి సామర్థ్యం బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞాన పోటీతత్వాన్ని పెంచడంపై దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్, నికర ఉత్పత్తి, పరీక్ష, పరిశోధనలు, భారత పారిశ్రామిక పరిసర వ్యవస్దలో ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు.
రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
శివాజీనగర: వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రాజ్యసభలోని కర్ణాటకకు చెందిన నాలుగు స్థానాలతో పాటు మొత్తం 24 స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. జూన్ 18న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ సమర్పణకు జూన్ 8 ఆఖరి రోజు. నామినేషన్ ఉపసంహరణకు జూన్ 11 ఆఖరి తేదీ. జూన్ 18న ఓట్ల లెక్కింపు జరిపి ఆరోజునే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ 24 మంది రాజ్యసభ సభ్యులు వివిధ రాష్ట్రాల శాసనసభల నుంచి ఎన్నికవుతారు. ప్రస్తుతం కర్ణాటకను ప్రాతినిథ్యం వహిస్తున్న జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెళగావి బీజేపీ నాయకుడు ఈరణ్ణ కదడి, దక్షిణ కన్నడ బీజేపీ నాయకుడు కే.నారాయణల రాజ్యసభలో ప్రస్తుత కాలావధి జూన్ 25న పూర్తి కానుంది. దేవెగౌడ మరో అవధికి రాజ్యసభలోకి ప్రవేశిస్తారనే చర్చ రాజకీయ రంగంలో ఆరంభమైంది. రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో 3 స్థానాలు కాంగ్రెస్‌కు లభించనున్నాయి. బీజేపీకి ఒక స్థానం మాత్రమే లభించే అవకాశముంది. 93 ఏళ్ల వయస్సులో కూడా దేవెగౌడ మరోసారి రాజ్యసభలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే వారి పార్టీకి సంఖ్యా బలం లేని కారణంగా బీజేపీ సహాయ హస్తం అందిస్తే రాజ్యసభలోకి ప్రవేశించవచ్చనే అంచనాలో జేడీఎస్ పార్టీ అధినాయకత్వం ఉంది.


