నకిలీ ప్రొఫైల్‌తో యువతులకు మోసం | - | Sakshi
Sakshi News home page

నకిలీ ప్రొఫైల్‌తో యువతులకు మోసం

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

బనశంకరి: మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో తాను డాక్టర్‌ని అని ఓ వంచకుడు నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి వివాహం చేసుకుంటానని నమ్మించి మైసూరు, బెంగళూరులకు చెందిన 10 మందికి పైగా యువతులకు లక్షలాది రూపాయల వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రదీప్‌ సోలోమన్‌ మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో డాక్టర్‌ ప్రదీప్‌ సోలోమన్‌ పేరుతో హైఫై ప్రొఫైల్‌ను తెరిచారు. కుమారుడి వంచనకు తల్లి కళావతి మద్దతు తెలిపింది. వీరిద్దరూ మైసూరులో విలాసవంతమైన బంగళాను అద్దెకు తీసుకుని శ్రీమంతులుగా బిల్డప్‌ కొట్టారు. వివాహ సంబంధాలు కలుపుకోవడానికి ముందుకువచ్చే వధువు కుటుంబ సభ్యులకు తమ మాయమాటలతో వల వేసేవారు.

డబ్బు బ్లాక్‌ అయిందని నమ్మించి..

యువతుల కుటుంబ సభ్యులకు నమ్మకం కలిగించిన అనంతరం సాంకేతిక కారణాలతో పెద్ద మొత్తంలో నగదు బ్యాంకులో చిక్కుకుందని, కొద్దిరోజుల్లో డబ్బు వెనక్కివస్తుందని, ప్రస్తుతం చాలా అర్జెంట్‌గా ఉందని తెలిపి లక్షలాది రూపాయల డబ్బును డిమాండ్‌ చేసేవారు. ప్రదీప్‌ మాటలు నమ్మిన బెంగళూరుకు చెందిన కుటుంబం లక్షలాది రూపాయలు డబ్బు ఇచ్చి వంచనకు గురయ్యారు. డబ్బు తమ చేతికి అందగానే తల్లీ కుమారుడు ఇద్దరూ పారిపోయారు. ప్రదీప్‌ చేతిలో మోసపోయిన మైసూరు, బెంగళూరులకు చెందిన అనేక మంది మైసూరులోని బంగళా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరిపై ఆడుగోడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement