బక్రీద్‌ శాంతియుతంగా జరుపుకోండి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ శాంతియుతంగా జరుపుకోండి

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఈనెల 28న బక్రీద్‌ పండుగను ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంశు గిరి సూచించారు. శుక్రవారం సదరు బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ముస్లింలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్‌ నిర్వహణపై ముస్లింలతో చర్చించారు. పండుగ సమయంలో జంతు వధను నిషేధించాలన్నారు. పండుగను ప్రశాంతంగా ఆచరించడానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ షక్రిదా, సీఐలు దాదావలీ, ఉమేష్‌ కామ్లే, ఎస్‌ఐలు మంజునాథ్‌, లక్ష్మి, బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మురికి కాలువలపై

బండలు అమర్చాలి

రాయచూరు రూరల్‌: రాయచూరు నగరంలో పలు ప్రాంతాల్లో మురికి కాలువలకు మూతలు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక సేనే అధ్యక్షుడు అనిల్‌ పాషా తెలిపారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో వర్షపు నీరు డ్రైనేజీల్లో అధికంగా ప్రవహిస్తుందన్నారు. ప్రజలు నడచి వెళ్లేందుకు వీలుగా తెరచిన కాలువలపై బండలు వేసి మూసి వేయాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు.

మామను హతమార్చిన అల్లుడు

హుబ్లీ: షెడ్డులో మొబైల్‌ చార్జింగ్‌ పెట్టవద్దు అని చెప్పినందుకు మామను అల్లుడు ఇనుప రాడుతో కొట్టి హతమార్చిన ఘటన గురువారం రాత్రి తాలూకా రేవడిహళలో చోటు చేసుకుంది. శబ్బి గ్రామానికి చెందిన దాదాపీర (38) వహత్యకు గురైన వ్యక్తి. ఈయన అల్లుడు, కార్మికుడు అయిన అజీమ్‌ జమకానే హత్య చేశాడు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మానవ హక్కుల కమిషన్‌

పేరు దుర్వినియోగం

మహిళపై కేసు నమోదు

బళ్లారి అర్బన్‌: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పేరును దుర్వినియోగం చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించిన ఆరోపణలపై ఒక మహిళపై గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని మోకా రోడ్డులో ఉన్న కేఆర్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మార్చి 10, 11 తేదీల్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల మండలి అనే సంస్థ అధ్యక్షురాలు జే.పుష్ప, ఆమె సభ్యులు తమ సంస్థను జాతీయ మానవ హక్కుల కమిషన్‌గా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయమై సమాచారం సేకరించిన పోలీసులు, ప్రభుత్వ సంస్థ పేరును అక్రమంగా ఉపయోగించినందుకు జె.పుష్ప, ఇతర సభ్యులపై కేసు నమోదు చేశారు.

గాలీవానకు కూలిన షెడ్డు: రైతు మృతి

మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కాలోని హసాండహళ్లి గ్రామంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. షెడ్డు కూలడంతో హసాండహళ్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలడంతో ఇంట్లో ఉన్న 7 మంది చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దొడ్డడాసవహళ్లి గ్రామానికి చెందిన రైతు చన్నరాయప్పకు చెందిన ఇల్లు పూర్తిగా దెబ్బతింది. కోతకు వచ్చి క్యాప్సికం పంట నాశనమైంది. అరసనహళ్లి గ్రామంలో సౌభాగ్య అనే మహిళకు చెందిన ఇంటి సిమెంట్‌ రేకులు గాలికి ఎగిరి పోయాయి. దాదాపు 40 నిమిషాలకు పైగా వర్షం కురిసింది.

అనుభవ మంటపం

స్థాపించడం హర్షణీయం

కోలారు: బసవణ్ణ అనాటి కాలానికి మాత్రమే కాకుండా నేటి తరం ప్రజల ప్రశ్నలకు కూడా సమాధానంగా నిలబడ్డారు. బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయం అనుభవ మంటపం వేదికను స్థాపించడం హర్షణీయమని హంపీ కన్నడ విశ్వ విద్యాలయం కులపతి పరశివమూర్తి తెలిపారు. శుక్రవారం నగర సమీపంలోని బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయంలోని సువర్ణగంగ క్యాంపస్‌లో అనుభవ మంటపం విచార మంథన మాలె కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.అనుభవం, అనుభావ వ్యత్యాసాలను తెలియజేశారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచే వారే అనుభవవంతులు అని పేర్కొన్నారు. బసవణ్ణ బాల్యంలోని శిక్షణ, ప్రశ్నించే మనో భావం అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు లోకనాథ్‌, డి.కుముద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement