ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

రాయచూరు రూరల్‌: సమాజ సేవ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అరుణాంశు గిరి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవోదయ వైద్య విద్యాలయంలో పోలీసులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడికి గురికాకూడని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుని పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు. క్యాన్సర్‌, గుండెపోటు తదితర వ్యాధుల నుంచి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. దాదాపు 200 మంది పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతివీర, కళాశాల రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌, విశ్వనాథ్‌లు ఉన్నారు.

వాల్మీకి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రాధాన్యత

రాయచూరు రూరల్‌: రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని గ్రామీణ శాసన సభ్యుడు బసవన గౌడ పేర్కొన్నారు. శుక్రవారం మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయ ఆవరణలో రూ.8 కోట్లతో భవన నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. రాయచూరు, యాదగిరి జిల్లాలోని పీజీ విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు వీలు కల్పించే విధంగా భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజల సహకారం అవసరం అని తెలిపారు.

ఇంట్లో నగలు, నగదు చోరీ

క్రిష్ణగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన సూళగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా అడ్డగురికి గ్రామానికి చెందిన రవి దంపతులు గురువారం కూలి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటి కొచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టినట్లు గుర్తించారు. లోపలకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 6 పౌన్ల బంగారు నగలు, రూ.20 వేల నగదు కనిపించ లేదు. గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్లు తెలియడంతో సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

8న మలూరుకు సీఎం సిద్దు

మాలూరు: మాలూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూన్‌ 8వ తేదీన రానున్నారని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. మాలూరులోని శ్రీరంగంకళ్యాణ మంటపంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులకు సీఎం హక్కు పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. 800 పైగా వసతి లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తిగళ సముదాయ మండలికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న మంజునాథ్‌ను ఎమ్మెల్యే అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement