హొసపేటె: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐఎం నేత భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని తెలిపారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై పెట్రో ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇంకా పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
డీజిల్ కోసం రైతుల బారులు
హొసపేటె: పెట్రోల్, డీజిల్ కోసం ఇప్పుడు బైకర్లే కాకుండా రైతులు కూడా క్యూ కట్టిన ఘటన విజయనగర జిల్లా హువినహడగలిలో గురువారం రాత్రి జరిగింది. ఇటీవల తొలకరి వర్షాలు కురవడంతో రైతులు తమ వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ట్రాక్టర్లకు అవసరమైన ఇంధనం లభించక పోవడంతో రైతులు గుర్రుగా ఉన్నారు. గురువారం రాత్రి మైలార గ్రామంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద రైతులు రాత్రంతా డీజిల్ కోసం క్యూలో నిలబడ్డారు. కొన్ని పెట్రోల్ బంక్‌లో డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. డీజిల్ అందుబాటులో ఉన్న బంక్ దగ్గర రైతులు క్యాన్లను క్యూలో ఉంచి డీజిల్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం కనిపించింది. డీజిల్ ట్యాంకులు రాత్రికి ఆలస్యంగా వస్తాయనే ఆశతో రైతులు రాత్రంతా ఎదురు చూశారు.


