బనశంకరి: రుతుపవనాలకు ముందుగానే రాజధాని బెంగళూరులో వర్షాలు పలకరిస్తున్నాయి. గురువారం సాయంత్రం భారీ గాలులు, ఉరుములు పిడుగుల మధ్య జడివాన కురిసింది. నగరం అతలాకుతలమైంది.
వాహనాలు ఎక్కడివక్కడే
● బెంగళూరులో మెజస్టిక్, సంపంగి రామనగర, కంఠీరవ స్టేడియం, కార్పొరేషన్ సర్కిల్, ఎంజీ.రోడ్డు, గాంధీనగర, రిచ్‌మండ్‌సర్కిల్, హలసూరు.. ఇలా అన్ని ప్రాంతాలో ఆకస్మిక జడివాన హడలెత్తించింది.
● రోడ్లు జలమయం కావడంతో కార్లు, బైక్‌లు చిక్కుబడిపోయారు. ఇళ్లకు వెళ్లేవారందరూ రోడ్లపై నిలబడిపోయారు.
● శాంతినగర, లాల్‌బాగ్, కబ్బన్‌పార్కు, జయనగర, రాజాజీనగర, బసవేశ్వరనగర, విధానసౌధ, విల్సన్‌గార్డెన్, కన్నింగ్‌హ్యామ్ రోడ్డులో వడగండ్లు కురిశాయి.
● దాదాపు అన్ని కూడళ్లలో రాత్రి పొద్దుపోయే వరకూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. విధానసౌధ, వికాససౌధ, నృపతుంగ రోడ్డు, మైసూరు బ్యాంక్ సర్కిల్, కబ్బన్ పార్కుతో పాటు ప్రముఖ రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
కార్ల మీద పడిన చెట్లు
● నగరంలో అనేకచోట్ల చెట్లు కూలి ప్రజల ఇబ్బందులను తీవ్రం చేశాయి. వెస్ట్ కార్డు రోడ్డులో సిటి ఆసుపత్రి వద్ద చెట్టు కూలి రెండుకార్లు ధ్వంసమయ్యాయి.
● ఇందిరానగర 16 వ క్రాస్‌లో చెట్టు పడి కారు దెబ్బతింది. ఎవరికీ ఏమీ కాలేదు.
● కృష్ణరాజపురం దూరవాణి నగర చర్చ్ వద్ద చెట్టు, కరెంటు స్తంభం రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. దీంతో దూరవాణినగర, రామూర్తినగర రోడ్డులో సంచారం బందయింది.
● రాజాజీనగర కేతమారనహళ్లి వరదరాజస్వామి ఆలయంలో చెట్టు కూలి ఆలయం మీద పడింది. కేఆర్ సర్కిల్ వద్ద అండర్‌పాస్‌ను మూసేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
● అర్ధగంట కురిసిన వర్షానికే బెంగళూరు మధ్యభాగం కకావికలమైంది.
మెట్రో రైళ్లకు బ్రేక్
వర్ష తీవ్రత ఎంతగా ఉందంటే నమ్మ మెట్రో రైళ్లకు కూడా ఆటంకం ఏర్పడింది. గ్రీన్, పర్పుల్ లైన్‌తో పాటు ప్రముఖ మార్గాల మెట్రో సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయి. గాలీవాన వల్ల అన్ని మెట్రో మార్గాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికుల భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని మెట్రో సంస్థ తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
బెంగళూరులో జడివాన
కూలిన చెట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు
పలుచోట్ల మెట్రో సర్వీసులకు అంతరాయం


