దొడ్డబళ్లాపురం:ఽ దేశంలో సంచలనం కలిగించిన ధర్మస్థలలో అస్థిపంజరాల లభ్యం కేసులో పోలీసు ఫోరెన్సిక్ సిబ్బంది మరోసారి దర్యాప్తు ప్రారంభించారు. 4 నెలల క్రితం ధర్మస్థలలోని బంగ్ల గుడ్డె అడవిలో 7 అస్థిపంజరాలు దొరికాయి. వాటిని బెంగళూరు మడివాళలోని ఎఫ్‌ఎస్‌ఎల్ సెంటర్‌కి తరలించి పరీక్షలు జరిపారు. గురువారంనాడు ముగ్గురు ఎఫ్‌ఎస్‌ఎల్ సిబ్బంది బెంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్లారు. ఎముకలు లభించిన చోటును పరిశీలించారు. ఈ సందర్భంగా నిందితుడు ప్రదీప్‌ని కూడా తీసుకెళ్లారు.
అది వదంతి మాత్రమే: డీకే
మైసూరు: చామరాజనగరను సందర్శిస్తే అధికారం చేజారడం ఖాయం అనేది కేవలం తప్పుడు వదంతి మాత్రమేనని, ఎలాంటి నిజం లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆయన గురువారం చామరాజనగర జిల్లాలో కొళ్లెగాలలో విలేకరులతో మాట్లాడారు. చామరాజనగర పుణ్యక్షేత్రాలతో కూడిన పుణ్యభూమి అని అభివర్ణించారు. గతంలో కోవిడ్ సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబీకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. తమిళనాడుకు 177 టీఎంసీల కావేరి నీటిని వదలాలన్న సుప్రీంకోర్టు ఆదేశంపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
సీఎం గొడవను తేల్చేయాలి
● కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
శివాజీనగర: సీఎం కుర్చీ వివాదాన్ని హైకమాండ్ తక్షణమే పరిష్కరించాలని బంగారుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణస్వామి హైకమాండ్‌ను డిమాండ్ చేశారు. గురువారం విధానసౌధలో మాట్లాడుతూ... సీఎం కుర్చీపై గొడవ జరగకుండా ఉండాల్సింది. ప్రజలు 136 స్థానాలు ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ పునర్విభజన చేసి, పని చేయని మంత్రులను తొలగించి ఉంటే సరిపోయేది. సీఎం కుర్చీ రభసపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిద్దరామయ్యను కొనసాగిస్తారా?, లేక మరెవరికై నా ఇస్తారా? అనేది హైకమాండ్ తేల్చేయాలి అని ఆయన అన్నారు. అనేక శాఖల్లో మంత్రుల మాటలను అధికారులు వినటం లేదు, దీనిని పరిష్కరించాలన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చాక తాను, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవులను కోరతామన్నారు. 15 మంది కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం వస్తుందని తెలిసిందన్నారు.
26న ప్రధాని మోదీ రాక!
దొడ్డబళ్లాపురం: ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనడానికి ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, 26న ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరుకు వస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. యలహంక సమీపంలోని ప్రైవేటు రిసార్టులో నితిన్ పార్టీ నేతలతో సమావేశం జరుపుతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, పక్ష నేత ఆర్ అశోక్ తదితరులు ఏర్పాట్లపై చర్చించారు.
రాష్ట్ర బీజేపీ సారథి
ఎంపికపై కసరత్తు
శివాజీనగర: రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుని నియామకంపై పార్టీ హైకమాండ్ కసరత్తుకు నాంది పలికింది. ప్రస్తుత అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర కొనసాగుతారో, లేదో.. కొత్త సారథి ఎవరో అనేది ఉత్కంఠకు బీజమేసింది. రాష్ట్ర బీజేపీకి పూర్తిస్థాయి అధ్యక్షున్ని నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించారు. ప్రస్తుతం విజయేంద్ర తాత్కాలికంగా పదవిలో ఉన్నారు. సీనియర్ నేత శివప్రకాశ్ బుధవారం బెంగళూరుకు వచ్చారు. కొత్త సారథి గురించి పార్టీ ఆఫీసులో నాయకులతో అభిప్రాయాలను ఆలకించారు. రోజంతా ఈ భేటీ సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని స్థాయిల నాయకులు ఇందులో పాల్గొన్నారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది.
పెట్రో ధరలపై సీఎం భగ్గు
శివాజీనగర: పెట్రోల్, డీజిల్‌పై ఉన్న రాష్ట్ర పన్నును తగ్గించేది లేదని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కేంద్రం ధరలు పెంచడంతో, పన్నుల్ని తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం తెలిసిందే. దీనిపై సీఎం విధానసౌధలో మాట్లాడుతూ కేంద్రం ధరలను పెంచితే, మేము తగ్గించాలా?, పెంచినవారిని అడగండి అని విలేకరులపై రుసరుసలాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంధన ధరలు ఎలా ఉండేవి? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.48 ఉండేవి. గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండేది. నేడు ధరలు ఎంత, ఎవరు పెంచారు? అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని మీడియాపై ఆగ్రహించారు.


