బనశంకరి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చేరడానికి వయో పరిమితి నిబంధనను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్చి 28 తేదీన విద్యాశాఖ విధించిన నిబంధనలను ప్రశ్నిస్తూ బెంగళూరుకు చెందిన పలువురు తల్లిదండ్రులు హైకోర్టులో అర్జీలు దాఖలు చేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఆర్.కృష్ణకుమార్ విచారించారు. ఒకటో తరగతిలో చేరాలంటే 6 ఏళ్లు పూర్తయి ఉండాలనే నిబంధన సరికాదని వారి న్యాయవాదులు వాదించారు. 5 ఏళ్ల 5 నెలలు పూర్తయిన బాలలను చేర్చుకోవాలన్నారు.
దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. జడ్జి స్పందిస్తూ వయో పరిమితి సడలింపును పునఃపరిశీలించి వారంలోగా పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రాథమిక విద్యాశాఖను ఆదేశించారు. కాగా, గత కొన్నేళ్లుగా ఒకటో తరగతిలో బాలల వయసుపై వివాదం సాగుతోంది. దీంతో తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది.
గృహలక్ష్మీ సొమ్ము కోసం కోర్టుకు మహిళలు
శివాజీనగర: పంచ గ్యారెంటీలలో ఒకటైన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు, ప్రభుత్వానికి నోటీస్ జారీచేసింది. పలువురు మహిళలు కోర్టుకెక్కడమే కారణం. బెంగళూరులోని ఆర్.గంగా, జీ.డీ.పవిత్ర అనే లబ్ధిదారులు తమకు డబ్బులు పడడం లేదని ప్రజాహిత పిటిషన్‌ను దాఖలు చేయగా, న్యాయమూర్తులు జస్టిస్ సూరజ్ గోవిందరాజు, కే.మన్మథరావులు విచారించారు. ఈ పథకం పేద మహిళలకు మంచిదే. కానీ నెలనెలా డబ్బులు పడడం లేదు, పెండింగ్‌లో ఉన్న సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసేలా సర్కారును ఆదేశించాలి అని పిటిషనర్ల వకీలు విన్నవించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని జడ్జిలు సర్కారుకు నోటీసులు జారీచేసి వాయిదా వేశారు.
వయో పరిమితిపై తల్లిదండ్రుల పిటిషన్లు
వారంలోగా తేల్చాలన్న కోర్టు


