మైసూరు: కారు, ప్యాసింజర్ ఆటో ఎదురుగా ఢీకొనడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని టీ.నరసీపుర తాలూకా చౌహళ్లి గ్రామం వద్ద జరిగింది. తలకాడు మెయిన్ రోడ్డులోని చౌహళ్లి గ్రామం వద్ద వేగంగా వచ్చిన కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటో రోడ్డు పక్కకు బోల్తా పడింది. అందులోని ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. కారు డ్రైవర్ మైసూరువాసి శివప్రకాష్ అరస్, ఆటోలో ఉన్న తలకాడువాసులు రాణి, మణి, పుట్టతాయమ్మ, రాచప్పాజీ తదితరులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయం చేసి ఆటోలోని 11 మంది క్షతగాత్రులను వెలికితీసి టీ.నరసీపుర ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. టీ.నరసీపుర పోలీసు అధికారులు రెండు వాహనదారులపై కేసు నమోదు చేశారు.


