● బెంగళూరు సహా పలు జిల్లాలకు అలర్ట్
శివాజీనగర: రాష్ట్రంలో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. భారీ వానల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. బీదర్, కల్బుర్గి, యాదగిరి, రాయచూరు, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసే అవకాశముంది. ఉత్తర, మధ్య కర్ణాటక జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీచేసింది. బెంగళూరులో పాలికె అధికారులు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉద్యాననగరిలో మధ్యాహ్నం నుంచి దట్టంగా మేఘావృతమై తరువాత వర్షం ఊపందుకుంది.


