బెళగావి– సికింద్రాబాద్‌ రైలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బెళగావి– సికింద్రాబాద్‌ రైలు ప్రారంభం

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

రాయచూరు రూరల్‌ : కుందానగరి బెళగావి నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు వీక్లీ నూతన రైలును మాజీ ముఖ్యమంత్రి, బెళగావి లోక్‌సభ సభ్యుడు జగదీష్‌ శెట్టర్‌ మంగళవారం బెళగావి రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి మంగళవారం బెళగావి నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం చేరుతుంది. కాగా ఈ రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్‌లో 4.30 గంటలకు బయలుదేరి బెళగావికి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. శాసన సభ్యులు అభయ్‌ పాటిల్‌, అనిల్‌ బెనక, అధికారి ప్రేమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఔషధ దుకాణ వ్యాపారుల నిరసన

హొసపేటె: ఫార్మసీల వెల్లువ, ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లకు నిరసనగా విజయనగర జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి నగరంలో నిరసన చేపట్టారు. హొసపేటెలోని టౌన్‌ రీడింగ్‌ రూం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల గుండా అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మెడికల్‌ షాపుల యజమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో మందుల దుకాణాల యజమానులు నిరసనలో పాల్గొన్నారు.

ఇంటి పైకప్పు కూలి

మహిళ మృతి

సాక్షి,బళ్లారి: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాత మిద్దె కూలి ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన విజయపుర జిల్లా నిడగుంది పట్టణంలో జరిగింది. గౌరీశ్వర దేవస్థానం సమీపంలో మహాదేవి (55) తన ఇంట్లో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి బయట భర్త శివానంద పడుకోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే నిడగుంది పోలీసులు చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల అరె్‌స్ట్‌కు వినతి

రాయచూరు రూరల్‌: బీదర్‌లో కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేయాలని కర్ణాటక భీమ సేన అధ్యక్షుడు శంకర్‌ రామలింగయ్య డిమాండ్‌ చేశారు. గురువారం బీదర్‌ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. బీదర్‌లో నివాసముంటున్న క్రీడాకారిణిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్నారు. దళిత బాలికపై ఇలాంటి కృత్యానికి పాల్పడిన దోషులకు బీదర్‌ జిల్లా ఎస్పీ ప్రదీప్‌ రక్షణ కల్పిస్తున్నారని, ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.

స్పిరిట్‌ ట్యాంకర్‌ స్వాధీనం

నిందితుడు అరెస్ట్‌

14 వేల లీటర్ల స్పిరిట్‌ జప్తు

రాయచూరు రూరల్‌ : బెళగావి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 14 వేల లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ శాఖ కమిషనర్‌ మంజునాథ్‌ వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఖానాపుర తాలూకా జాంజోట–కణకుంబి మధ్యలో స్పిరిట్‌ను తరలిస్తుండగా మైసూరు జిల్లా నంజనగూడుకు చెందిన సిద్దరాజ పుట్టస్వామి(47)ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement