ఆచారాలు లేని అభ్యుదయ వివాహం | - | Sakshi
Sakshi News home page

ఆచారాలు లేని అభ్యుదయ వివాహం

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

బళ్లారి రూరల్‌: పురోహితుడు లేడు, మేళ తాళ వాయిద్యాలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు, రాహుకాలం యమగండం, ముహూర్తం లేదు. వధువు, వరుడు ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు, ముఖ్యఅతిథుల సమక్షంలో తాళికట్టి పెళ్లి చేసుకొన్నారు. ఈ అభ్యుదయ వివాహం నగరంలోని విద్యానగర్‌ గంగామత కళ్యాణ మండపంలో జరిగింది. ఓ కార్యక్రమం తరహాలో జరిగిన ఈ పెళ్లికి అధ్యక్షుడిగా సండూరు విరక్తమఠ పీఠాధ్యక్షుడు ప్రభు మహాస్వామి పాల్గొని మాట్లాడారు. ఇది ఆదర్శ వివాహం. వాయిద్యాలు, పురోహితుడు, రాహుకాలం, యమగండం చూడని పెళ్లి అని తెలిపారు. ఆచారాల పేరుతో లక్షలు వెచ్చించి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసి చివరకు పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి జీవితాంతం కష్టపడుతున్నారన్నారు. ఇద్దరి మనసులు కలిసినపుడే లగ్నమని తెలిపారు. ఇప్పుడు చాలా మంది యువత సరళ పెళ్లిళ్లపై మొగ్గు చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పెళ్లి ఖర్చును సామాజిక సహాయ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్నడ వారపత్రిక కార్యనిరత సంపాదకుడు డాక్టర్‌ ఎస్‌.వై.గురుశాంత్‌ మాట్లాడుతూ ఆర్భాటంగా పెళ్లిళ్లు చేస్తూ చివరకు వరకట్నం సరిపోలేదని వేధింపులు, నవవధువుల ఆత్మహత్యలను నివారించే దిశగా ఈ తరహా పెళ్లిళ్లు జరగాలని ఆకాంక్షించారు. వరుడు యూ.వికాస్‌ వధువు యూ.అఖిల మెడలో తాళికట్టాడు. కర్ణాటక జనవాది మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జీ.చంద్రకుమారి, సీపీఐ(ఎం) కార్యదర్శలు జీ.సత్యబాబు, ఆర్‌.భాస్కర్‌రెడ్డి, వరుడి తండ్రి కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు యూ.బసవరాజ్‌ కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

పురోహితుడు, మేళతాళాలు,

ముహూర్తం లేని పెళ్లి

సరళ వివాహం ఓ కార్యక్రమంలా ముగిసిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement