హొసపేటె: దేశ ఐక్యత, శాంతి, సామరస్యాలకు ముప్పుగా పరిణమించే దురాగతాలను అరికడదామని, యువతలో అవగాహనకు యావత్ దేశం నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటోందని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి పేర్కొన్నారు. గురువారం నగరంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం ఈ రోజును పాటిస్తారన్నారు. దేశంలో శాంతి, అహింస, మానవతా విలువలను కాపాడడం, యువతను హింసకు దూరంగా ఉంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఉగ్రవాదం ఏ మతానికో, కులానికో, దేశానికో పరిమితం కాదన్నారు. దీనిని తుదముట్టించేందుకు యావత్ మానవాళి ఏకం కావాలన్నారు. ఏడీసీ లోకేష్, వివిధ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


