పిల్లలూ.. సర్కారీ బడిలో చేరండి | - | Sakshi
Sakshi News home page

పిల్లలూ.. సర్కారీ బడిలో చేరండి

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

కోలారు: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ప్రధానోపాధ్యాయురాలు తాహేరా నుస్రత్‌ మనవి చేశారు. బుధవారం దాఖలాతి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అరాభి కొత్తనూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మీ పిల్లలను సర్కారీ బడులలోనే చేర్పించాలని కోరారు. దాతల సహకారంతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా చదువుల బోధన, సౌకర్యాలు లభిస్తున్నాయని ఆమె తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నేడు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సౌలభ్యాలను స్వయంగా చూడాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోలాగా ఉత్తమ ల్యాబొరేటరి, కంప్యూటర్‌ శిక్షణ అందిస్తున్నామన్నారు. టీచర్లు భవాని, కె లీలా, సుగుణా, శ్రీనివాసులు, రమాదేవి పాల్గొన్నారు.

సత్యమ్మ దేవి జాతర ఉత్సవం

కోలారు: తాలూకాలోని కామధేనుహళ్లి గ్రామంలో వెలసిన ఆదిశక్తి సత్యమ్మ దేవి ఉట్ల జాత్ర, దీపోత్సవాలలో చుట్టుపక్కల 9 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, అలంకారం, నైవేద్య సమర్పణ నిర్వహించారు. ఉట్ల స్తంభాన్ని ఏర్పాటు చేసి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. మహిళలు తలపై దీపాలను తీసుకు వచ్చి సమర్పించారు.

జోసెఫ్‌ స్వామి జయంతి వేడుకలు

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ పట్టణంలో సెయింట్‌ జోసెఫ్‌ స్వామి జయంతి వేడుకలను మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిపారు. వందలాది భక్తులు చర్చి నుంచి కొవ్వొత్తులు పట్టుకుని ప్రధాన వీధుల్లో ఊరేగింపు సాగించారు. ఆనేకల్‌ వద్ద 18వ శతాబ్దంలో ఖననం చేయబడిన స్వామి మాన్యుయెల్‌ డికునా సమాధి చరిత్రకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో సెయింట్‌ జోసెఫ్‌ యొక్క నిరాడంబరత, విశ్వాసం, సామరస్యాన్ని అలవర్చుకోవాలి. సహనంతో జీవితాన్ని గడపాలి అని సెయింట్‌ జోసెఫ్స్‌ రిలీజియస్‌ సెంటర్‌ ఫాదర్‌ శాంతరాజ్‌ థామస్‌ అన్నారు.

అరేబియాలో గాలుల కల్లోలం

చేపల వేట నిషేధం

యశవంతపుర/ దొడ్డబళ్లాపురం: నైరుతి రుతు పవనాల రాకతో అరేబియా సముద్రంలో కల్లోల వాతావరణం నెలకొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి తీవ్ర గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. సముద్రంలో ఉన్న మత్యృకారులు తక్షణం ఒడ్డుకు రావాలని హెచ్చరికలను జారీ చేశారు.

ఉత్తర కన్నడలో జలక్రీడలు బంద్‌

రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జల క్రీడలపై నియంత్రణ విధించారు. ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రం తీర ప్రాంతాలు, శరావతి నది బ్యాక్‌ వాటర్‌, అఘనాశిని నదీ తీర ప్రాంతాల్లో అన్ని రకాల పడవలు, స్పీడ్‌ బోట్ల విహారం తదితరాలపై నిషేధం విధించారు. వర్షాకాలం ముగిసే వరకూ ఇది అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement